Shashi Tharoor: విదేశాంగ విధానం ఏదో పార్టీ పాలసీ కాదు
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:55 AM
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన పార్టీని ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో ప్రధాని ఓటమిపై సంబరం సరికాదు
రాహుల్‌పై శశి థరూర్ పరోక్ష వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబరు 27 : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన పార్టీని ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘విదేశాంగ విధానం అనేది బీజేపీ లేక కాంగ్రెస్ విధానం కాదు. అది దేశానికి సంబంధించింది. ఈ విషయంలో దేశ ప్రధాని ఓటమిని వేడుక చేసుకోవడం సరికాదు. అది దేశం ఓటమి పట్ల సంబరపడటంతో సమానం. రాజకీయాల్లో ఉన్నవారు చేయకూడని పని అది.’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘ఓట్ చోరీ’ వంటి అంశాలపై ప్రధాని మోదీని నేరుగా వ్యతిరేకిస్తూ తన విదేశీ పర్యటనల్లో రాహుల్ పలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌గాంధీని పరోక్షంగా ఉద్దేశిస్తూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నాయి. శుక్రవారం ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో శశి థరూర్ పాల్గొన్నారు. పాకిస్థాన్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోరాదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. మారిన దాయాది సైనిక వ్యూహాలను భారత్ విస్మరించరాదని అన్నారు. పాక్- బంగ్లా రక్షణ ఒప్పంద సంప్రదింపులపై స్పందిస్తూ.. తనకు భారత్ శత్రువు అని చెప్పే ప్రయత్నం బంగ్లాదేశ్ చేస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి విడగొడతామంటూ వస్తున్న హెచ్చరికల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.