Share News

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి కుట్రదారు షాహిద్‌ కుట్టే హతం

ABN , Publish Date - May 14 , 2025 | 05:53 AM

పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్నిన టీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ షాహిద్‌ కుట్టే షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మృతిచెందారు.

 Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి కుట్రదారు షాహిద్‌ కుట్టే హతం

  • జమ్ము, కశ్మీర్‌లోని షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌

  • మరో ఇద్దరు ఉగ్రవాదులూ హతం

శ్రీనగర్‌, మే 13: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి కుట్ర పన్నిన ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’(టీఆర్‌ఎఫ్‌) కమాండర్‌ షాహిద్‌ కుట్టే హతమయ్యాడు. భద్రతా దళాలు జమ్ము, కశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఆపరేషన్‌ కెల్లర్‌ పేరిట జరిపిన సోదాల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా వారిలో ఒకరు షాహిద్‌ కుట్టే, మరొకరు అద్నాన్‌ షఫి అని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌ జిల్లాలోని షుక్రూ కెల్లెర్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అక్కడ సోదాలు చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా సిబ్బంది తిరిగి కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా చోటిపోరా హీరాపోరా ప్రాంతానికి చెందిన షాహిద్‌ కుట్టే 2023 మార్చిలో లష్కరే తాయిబాలో చేరి కమాండర్‌గా ఎదిగాడు. ఇతడిని కేటగిరీ ‘ఎ’ ఉగ్రవాదిగా గుర్తించారు. షాహిద్‌ హీరాపోరాలో 2024 మే 18న బీజేపీకి చెందిన ఒక సర్పంచినీ హత్య చేశాడు. కాగా షోపియాన్‌ జిల్లాలోని వందునా మెల్హోరా ప్రాంతానికి చెందిన షఫి 2024 అక్టోబరులో ఉగ్రబాట పట్టాడు. అదే నెలలో షోపియాన్‌లో స్థానికేతర కార్మికుల హత్యలో పాల్గొన్నాడు.

Updated Date - May 14 , 2025 | 05:55 AM