Anti Maoist Operations: మావోయిస్టుల అడ్డాలో భద్రతాదళాల పాగా
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:52 AM
ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతాదళాలు కొత్త క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి....
కర్రెగుట్ట కొండల్లో కొత్త క్యాంపు
ఫార్వర్డ్ ఆపరేషన్లకు బేస్‌గా ఉపయోగపడుతుందని ఆలోచన
బీజాపూర్/సుక్మా, నవంబరు 23: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతాదళాలు కొత్త క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి. దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మావోయిస్టు సీనియర్లకు సురక్షితమైన స్థావరంగా భావించేవారు. అయితే, మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కర్రెగుట్ట కొండల చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాలు 21 రోజుల సమగ్ర ఆపరేషన్‌ను నిర్వహించి 31 మంది నక్సల్స్‌ను అంతమొందించాయి. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలనూ స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న తాడ్పాలా గ్రామ సమీపంలో ఈ నెల 4న భద్రతాదళాలు ‘సురక్షా ఏవం జన్ సువిధ క్యాంపు’ను ఏర్పాటు చేసినట్టు ఒక అధికారి ఆదివారం వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలకు చెందిన 196, 205 బెటాలియన్లకు ఈ క్యాంపు ఎఫ్‌వోబీ(ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్)గా ఉపయోగపడనుందన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి, భద్రతాదళాల ఆపరేషనల్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, అలాగే, గ్రామస్థులకు అత్యవసర సేవలు కల్పించడంలో ఈ క్యాంపు దోహదపడుతుందని చెప్పారు. అడవుల్లో ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రంగానూ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఇక్కడి నుంచే ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దు వెంబడి సంయుక్త, సమన్వయ ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు చెప్పారు. కాగా, బీజాపూర్‌లో ఐదుగురు నక్సల్స్‌ను, ఇద్దరు సానుభూతిపరులను అరెస్టు చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు లొంగిపోయిన నక్సల్స్!
ఛత్తీ్‌సగఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ శనివారం సుక్మా జిల్లా కేంద్రంలోని లొంగిపోయిన నక్సల్స్ పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అందులో 94మంది లొంగిపోయిన నక్సల్స్ ఆశ్రయం పొందుతున్నారు. వారిలో 54 మంది పురుషులు, 40మంది మహిళలు ఉన్నారు. అక్కడ వారికి అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, వసతి సౌకర్యాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలో వారంతా శాసనసభను సందర్శించి ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎలా ఉంటాయో తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.