Security forces in Bastar: బస్తర్‌లో ఆఖరి యుద్ధానికి సిద్ధం!
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:37 AM
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఓవైపు మావోయిస్టు కీలక నేతల ఎన్‌కౌంటర్లతో పాటు...
ఆపరేషన్లు ముమ్మరం చేసిన భద్రతా బలగాలు
మావోయిస్టు కీలక నేతలు పాపారావు, దేవాలపై దృష్టి
బీజాపూర్ (ఛత్తీ్‌సగఢ్), డిసెంబరు 21: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఓవైపు మావోయిస్టు కీలక నేతల ఎన్‌కౌంటర్లతో పాటు మరోవైపు సరెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. గత నెలలో మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసిన భద్రతా బలగాలు.. ఇప్పుడు పాపారావు అలియాస్ మోంగు, బర్సా దేవా అనే మరో ఇద్దరు కీలక నేతలపై దృష్టి సారించాయి. వీరిద్దరూ నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులు కానప్పటికీ.. వారి లోతైన స్థానిక సంబంధాలు, ఛత్తీ్‌సగఢ్ దక్షిణ బస్తర్ (ఇక్కడ ఇప్పటికీ సుమారు 150 మంది సాయుధ క్యాడర్ ఉన్నట్లు అంచనా)లోని విశాలమైన ప్రాంతాలపై ఉన్న పట్టు.. వారిద్దరినీ భద్రతా బలగాల మోస్ట్ వాంటెట్ జాబితాలో చేర్చాయి. 48 ఏళ్ల బర్సా దేవా మావోయిస్టు పార్టీ కీలకమైన గెరిల్లా బెటాలియన్‌కు నాయతక్వం వహిస్తున్నారు. ఆయన సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పూవర్తికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. 57 ఏళ్ల పాపారావు సుక్మా జిల్లాలోని కిష్టారానికి చెందిన గిరిజనుడు. వీరిద్దరూ మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన దక్షిణ బస్తర్‌కు ఇన్‌చార్జిలుగా ఉన్నారు. బర్సా దేవా నేతృత్వంలోని ‘ది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)’ బెటాలియన్ ఒక్కటే ఇంకా క్రియాశీలంగా ఉందని బస్తర్ ఐజీ పీ సుందర్‌రాజ్ వెల్లడించారు. భద్రతా బలగాలు ఇప్పుడు పాపారావు, దేవాలను గుర్తించేందుకు ఆపరేషన్లను ముమ్మరం చేశాయి.
యుద్ధభూమి బస్తర్..!
2025లో డిసెంబరు 9 వరకు బస్తర్‌లో 96 ఎన్‌కౌంటర్ల ఘటనలు జరిగాయి. వీటిల్లో 252మంది యావోయిస్టులు మరణించగా.. 23మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. బస్తర్ రీజియన్ ఏళ్లుగా ఎంతటి యుద్ధభూమిగా కొనసాగిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారిలో సీపీఐ(మావోయిస్టు) చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా, ఇదే సమయంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఈ ఏడాదిలో మావోయిస్టులు 46 మంది పౌరులను చంపేశారు. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014లో 126 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండగా.. ఈ ఏడాదికి ఆ సంఖ్య 11కు పడిపోయింది.