Bengal Raj Bhavan: బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:03 AM
బీజేపీ నేరస్తులు గవర్నర్ అధికారిక నివాసంలో ఆశ్రయం పొందుతున్నారని, లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉందంటూ...
ఆయుధాలున్నాయన్న టీఎంసీ ఎంపీ ఆరోపణతో గవర్నర్ ఆదేశం
న్యూఢిల్లీ, నవంబరు 17: బీజేపీ నేరస్తులు గవర్నర్ అధికారిక నివాసంలో ఆశ్రయం పొందుతున్నారని, లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ గత శనివారం తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో సోమవారం పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు నిర్వహించారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సారథ్యంలో కోల్‌కతా పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు, బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన బృందాలు సోమవారం రాజ్‌భవన్‌లో ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ తర్వాత గవర్నర్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తనిఖీల్లో నిషేధిత వస్తువులేమీ దొరకలేదన్నారు. కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవేకాకుండా దురుద్దేశంతో కూడినవి, నిరాధారమైనవన్నారు. బెంగాల్‌లోని రాజకీయ నాయకులు క్రూరమైన ఆరోపణలు చేస్తుండటాన్ని తాను గమనించానని, బెనర్జీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిరూపితమైందని, ఆయనపై చాలా కఠినమైన చర్య తీసుకోనున్నట్టు గవర్నర్ బోస్ తెలిపారు.