General Category in Higher Education: ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సంఖ్య పైపైకి!
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:07 AM
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్ కోటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే..
జనరల్ విభాగాన్ని మించిపోయిన సంఖ్య
ఐఐఎం ఉదయ్‌పూర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 3: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్ కోటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. జనరల్ విభాగం విద్యార్థుల సంఖ్యనూ మించిపోయారు! 2010-11లో దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 43.1ు ఉండగా.. 2022-23 నాటికి అది 60.8 శాతానికి పెరగడం గమనార్హం! ఒక్క 2023లోనే జనరల్ విభాగం విద్యార్థుల కంటే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థుల నమోదు 95 లక్షలు ఎక్కువగా ఉండడం విశేషం. అదేసమయంలో 2011లో 57 శాతంగా ఉన్న జనరల్ విద్యార్థుల సంఖ్య 2023 నాటికి (ఆర్థికంగా వెనకబడిన కోటా విద్యార్థులను కలిపినా కూడా..) 39 శాతానికి పడిపోయింది. ఈ విషయాలు ఐఐఎం ఉదయ్‌పూర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యాయి. కేంద్ర విద్యా శాఖ 15 ఏళ్ల తర్వాత ‘ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే (ఏఐఎ్‌సహెచ్‌ఈ)’ వార్షిక నివేదికలను ప్రచురించడం ప్రారంభించగా.. వాటిని ఐఐఎం ఉదయ్‌పూర్‌కు చెందిన పరిశోధకుల బృందం విశ్లేషించినట్లు విద్యా పరిశోధనా సంస్థ ‘క్యాస్ట్‌ఫైల్స్’ ఓ ప్రకటనలో తెలిపింది. ‘భారతీయ ఉన్నత విద్యా రంగంలో విద్యార్థుల సామాజిక సమతుల్యతపై విస్తృతంగా ప్రచారంలో ఉన్న అనేక అపోహలకు ఈ నివేదిక తెరదించుతుంది’ అని ప్రొఫెసర్ కృష్ణమూర్తి అన్నారు. దేశంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నదానికి భిన్నంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోందని.. వారి సంఖ్య జనరల్ కేటగిరీ విద్యార్థులను మించిపోయిందని తెలిపారు. అన్ని రకాల విద్యాసంస్థల్లో ఇదే సరళి ఉందని వెల్లడించారు.