Children Using Substances: మత్తు అడ్డాలుగా విద్యాలయాలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:35 AM
జ్ఞాన వనాలుగా ఉండాల్సిన విద్యాలయాలు గంజాయి వనాలుగా మారుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. స్కూలుకు వెళ్లే పిల్లలు 12.9 ఏళ్లకే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని....
పదకొండేళ్లకే పిల్లల్లో డ్రగ్స్ వినియోగం
గోప్యంగా సర్వే జరిపిన మెడికల్ బృందాలు
ప్రతి ఏడు స్కూళ్లలో ఒకచోట డ్రగ్స్ భూతం
న్యూఢిల్లీ, డిసెంబరు 10: జ్ఞాన వనాలుగా ఉండాల్సిన విద్యాలయాలు గంజాయి వనాలుగా మారుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. స్కూలుకు వెళ్లే పిల్లలు 12.9 ఏళ్లకే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, కొందరైతే పదకొండేళ్లు వచ్చేటప్పటికే మత్తుకు బానిసలు అవుతున్నారంటూ ఈ అధ్యయనం మన విద్యావ్యవస్థపై ప్రమాద ఘంటికలు మోగించింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లఖ్‌నవూ, చండీగఢ్, ఇంఫాల్, జమ్మూ, దిబ్రూగఢ్, రాంచీ నగరాల పరిధిలో సగటున 14.7 ఏళ్ల వయసు కలిగిన 5,920 మంది విద్యార్థులపై గోప్య పద్ధతిలో ఈ అధ్యయనం సాగింది. దానిని నివేదిక రూపంలో నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ‘మీరు డ్రగ్స్ తీసుకుంటారా’ అని బహిరంగంగా మమ్మల్ని అడిగితే లేదనే మేం సమాధానం చెబుతాం’ అని తాము కలిసిన విద్యార్థుల్లో ఎక్కువమంది తెలిపారని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఢిల్లీ, ఎయిమ్స్‌లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ అధిపతి డాక్టర్ అంజూ ఽధావన్ తెలిపారు. చండీగఢ్, దిబ్రూగఢ్, లఖ్‌నవూ, బెంగళూరు, శ్రీనగర్, ఇంఫాల్, ముంబై, హైదరాబాద్, రాంచీలకు చెందిన వైద్య కళాశాలలకు చెందిక బృందాలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి. అధ్యయనం జరిపిన ప్రతి ఏడు స్కూళ్లలో కనీసం ఒకచోట విద్యార్థులు కనీసం ఒక్కసారైనా తాము డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపారు. మగపిల్లలు పొగాకు ఉత్పత్తులు, గంజాయి అధికంగా తీసుకుంటే, ఆడపిల్లలు నల్లమందు గోలీలు, ఇతర మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు.