Supreme court: రైతులను నిందించకండి
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:31 AM
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై రైతులను నిందించడం సరికాదని, ఈ అంశంపై విచారణ సందర్భంగా...
ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు
పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని వ్యాఖ్య
న్యూఢిల్లీ, డిసెంబరు 1: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై రైతులను నిందించడం సరికాదని, ఈ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల దహనం అంశాన్ని రాజకీయం చేయవద్దని, అహానికి సంబంధించిన విషయంగా చూడొద్దని సూచించింది. కోవిడ్ సమయంలో కూడా పంట వ్యర్థాల దహనం కొనసాగినా నీలాకాశం స్పష్టంగా కనపడిందని, గాలి నాణ్యత పెరిగిందని గుర్తు చేసింది. కాలుష్యానికి గల ప్రధాన కారణాన్ని గుర్తించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాలుష్య నివారణకు అధికారులు ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలు, గాలి నాణ్యత ఏ మేరకు మెరుగుపడిందనే విషయంపై వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అధికారుల కార్యాచరణ సమర్థంగా లేకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.