Rahul Gandhi Accuses BJP: ఓట్ల చోరీని అడ్డుకుంటే.. బిహార్‌లో విజయం మాదే!
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:57 AM
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడికెళ్లినా కూడా ఓట్ల చోరీ విషయంలో దొరికిపోతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు....
దేశాన్ని విభజించడానికి యత్నిస్తున్న బీజేపీ, ఆరెస్సెస్: రాహుల్
మోదీ, షా ఎక్కడికెళ్లినా ‘ఓట్ల చోరీ’పై దొరికిపోతారని వ్యాఖ్య
సాత్పురా టైగర్ రిజర్వులో రాహుల్ సఫారీ.. బీజేపీ విమర్శలు
శిక్షణ శిబిరానికి ఆలస్యంగా రాహుల్.. శిక్షగా పది బస్కీలు
కిషన్‌గంజ్, నవంబరు 9: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడికెళ్లినా కూడా ఓట్ల చోరీ విషయంలో దొరికిపోతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీని అడ్డుకుంటే బిహార్‌లో నూటికి నూరు శాతం ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కిషన్‌గంజ్, పూర్ణియా సభల్లో మాట్లాడారు. దేశాన్ని విభజించడానికి బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఇండియా కూటమి మాత్రం దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఓటు చోరీపై తాము చేసిన ఆరోపణలకు మోదీ, షా, ఈసీ వద్ద ఎలాంటి సమాధానం లేదని, ఇప్పుడు వాస్తవాలన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. హరియాణాలో పెద్దఎత్తున ఓట్ల చోరీ జరిగిందని ఇటీవల తాను బయటపెట్టానని గుర్తుచేశారు. దీనిపై మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పందించలేదని, రాహుల్ అబద్ధాలాడుతున్నాడని చెప్పే ధైర్యం వారు చేయలేదన్నారు. ఓటింగ్ రోజున (నవంబరు 11న) పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండి ఓట్ల చోరీని అడ్డుకోవాలని యువత, కార్మికులు, రైతులకు ఆయన పిలుపునిచ్చారు. చేపలు, మఖనా సమృద్ధిగా లభించే రాష్ట్రంలో 20ఏళ్లలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో నితీశ్ కుమార్ సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
ఓటు చోరీని కప్పిపుచ్చే యత్నం.. ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎ్‌సఐఆర్) అనేది ఓట్ల చోరీని కప్పిపుచ్చడానికి, వ్యవస్థను సంస్థాగతీకరించడానికి చేస్తున్న ప్రయత్నమని రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొనడానికి ఆయన ఆదివారం నర్మదాపురంలోని పంచ్‌మర్హికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హరియాణాలో 25 లక్షల ఓట్లను చోరీ చేశారని, ఇదే తరహాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ల్లోనూ జరిగి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. దీనిపై తమవద్ద మరిన్ని ఆధారాలతో పాటు వివరణాత్మక సమాచారం ఉందని, దాన్ని కూడా త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ చూపించింది చాలా స్వల్పమేనని చెప్పారు. అనంతరం సాత్పురా టైగర్ రిజర్వ్‌లోని పనార్పణిలో రాహుల్ జంగిల్ సఫారీకి వెళ్లారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బిహార్ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో రాహుల్‌కు ముందే అర్థమైపోయిందని, అందుకే సెలవు తీసుకొని మరీ జంగిల్ సఫారీని ఆస్వాదిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఎద్దేవా చేశారు. దీన్నిబట్టి ఆయన ప్రాధాన్యతలు ఏమిటో తెలుస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం ఈసీఐపై నిందలు వేస్తూ హెచ్(హాలిడే) ఫైల్స్‌పై ప్రజంటేషన్ ఇస్తారని ఆరోపించారు. బిహార్ ఎన్నికల ప్రచారం చివరి రోజున ప్రజల నుంచి కాకుండా జంతువుల నుంచి ఓట్లు అడగడానికి రాహుల్ అడవికి వచ్చారా అని మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ ప్రశ్నించారు. రాజకీయాలను రాహుల్ గాంధీ ఎప్పుడూ సీరియ్‌సగా తీసుకోలేదని ఆయన విమర్శించారు.