Sanchar Saathi App Not Mandatory: సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:27 AM
మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌బిల్ట్‌గా అందించాలన్న ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది....
వద్దనుకుంటే ఫోన్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు: సింధియా
న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌బిల్ట్‌గా అందించాలన్న ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ యాప్ తప్పనిసరి ఏమీ కాదని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రకటించారు. ప్రజలకు సైబర్ దాడులు, ఫోన్ల అపహరణ నుంచి భద్రత కల్పించేందుకే ఈ యాప్‌ను అన్ని మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా అందించాలని ఫోన్ల తయారీ కంపెనీలకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. పార్లమెంటు బయట మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా ప్రజలపై ప్రభుత్వం నిఘా పెట్టాలని చూస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ‘ప్రతి మొబైల్ వినియోగదారుడి వద్దకు సంచార్ సాథీ యాప్‌ను చేర్చటం మా విధి. ఒకవేళ మీరు దీనిని డిలీట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఫోన్‌లో ఉన్నా దీనిని మీరు వాడొద్దని నిర్ణయించుకుంటే, యాప్‌లో రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ యాప్ ఫోన్‌లో ఉన్నా పనిచేయదు. ఈ యాప్ ద్వారా ఎలాంటి గూఢచర్యంగానీ, ఫోన్‌కాల్స్‌పై నిఘాగానీ ఉండదు. వినియోగదారుల భద్రత కోసమే ఈ యాప్‌ను తీసుకొచ్చాం’ అని సింధియా స్పష్టంచేశారు. సంచార్‌సాథీ యాప్‌తో ప్రజల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి నష్టం ఉండదని మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ప్రజలపై నిఘా కోసమే ఈ యాప్: కాంగ్రెస్
బీజేపీ పాలనలో దేశం నిఘా నీడలోకి వెళ్లిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజలపై గూఢచర్యం నిర్వహించేందుకే కేంద్రం సంచార్ సాథీ యాప్‌ను తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. దేశాన్ని నిరంకుశత్వం గుప్పిట్లోకి తీసుకొనేందుకు జరుగుతున్న మరో ప్రయత్నమే ఈ యాప్‌ను తప్పనిసరి చేయటమని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. ‘ప్రజలపై నిఘా, గూఢచర్యం, నియంత్రణకు బీజేపీ పాలన హాల్‌మార్క్‌గా మారింది’ అని మండిపడ్డారు. మోదీ పాలనలో దేశం నిఘా రాజ్యం అయ్యిదని కాంగ్రెస్ కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిదానిని తప్పనిసరి చేయటం సమస్యలు సృష్టిస్తుందని కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ అంశంపై తాను పార్లమెంటులోనే మాట్లాడుతానని రాహుల్‌గాంధీ తెలిపారు. ఈ యాప్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.