Sambit Patra: జై పాక్ యాత్రగా.. జై హింద్ యాత్ర
ABN , Publish Date - May 31 , 2025 | 06:20 AM
కాంగ్రెస్ ‘జై హింద్ యాత్ర’ను బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ‘జై పాకిస్థాన్ యాత్ర’గా విమర్శించారు. పాకిస్థాన్‌లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలపై కాంగ్రెస్ నేతలకు ఆసక్తి లేకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని గుర్తించారు.
రాహుల్, రేవంత్‌పై సంబిత్ పాత్రా ధ్వజం
న్యూఢిల్లీ, మే 30: కాంగ్రెస్ చేపట్టిన ‘జై హింద్ యాత్ర’ కాస్తా ‘‘జై పాకిస్థాన్ యాత్ర’’గా మారిందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఆ యాత్రను ఆపివేసి, బదులుగా పాకిస్థాన్‌తో కలిసి ఒక ఉమ్మడి విలేకరుల సమావేశం పెట్టాలని వ్యంగ్యంగా సూచించారు. భారత్ - పాక్ మధ్య ఇటీవలి వివాదంపై కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను సంబిత్ శుక్రవారం తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారత యుద్ధ విమానాల నష్టాల గురించి అడుగుతున్నారే తప్ప పాకిస్థాన్‌లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాల వివరాలపై వారికి అంతగా ఆసక్తి లేనట్లుందని ఆయన విమర్శించారు.