Russia Woman Deportation: కర్ణాటక గుహలో మగ్గిన చిన్నారులు.. తండ్రినని చెప్పుకున్న వ్యక్తిపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Oct 06 , 2025 | 06:30 PM
కర్ణాటక గుహలో పోలీసులకు చిక్కిన రష్యన్ మహిళ, ఆమె పిల్లలను స్వదేశానికి తరలించొద్దంటూ పిటిషన్ వేసిన ఇజ్రాయెల్ వ్యక్తిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు గుహలో మగ్గుతుంటే మీరు గోవాలో ఏం చేస్తున్నారని మండిపడింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని ఓ గుహలో పోలీసులకు చిక్కిన రష్యన్ మహిళ, ఆమె పిల్లలను స్వదేశానికి తరలించొద్దంటూ చిన్నారుల తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారులు, తమ తల్లితో గుహలో తలదాచుకుంటుంటే మీరు గోవాలో ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మిమ్మల్ని కూడా ఎందుకు దేశం నుంచి పంపించకూడదో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌కు వెనక్కు తీసుకోవాలని తేల్చి చెప్పింది (Gokarna incident).
నీనా కుటీనా అనే రష్యా మహిళ తన ఇద్దరు పిల్లలతో గోకర్ణలోని రామతీర్థ గుహల్లో రహస్యంగా జీవిస్తూ జులై 11న పోలీసులకు చిక్కింది. రెండు నెలలుగా ఆమె గుహలోనే తలదాచుకుంటోందని పోలీసులు తెలిపారు. వారి వద్ద సరైన పత్రాలు ఏవీ లేవని అన్నారు. ప్రస్తుతం వారు పోలీసుల సంరక్షణలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా కాన్సులేట్ వారికి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్స్‌ను కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెలీ జాతీయుడు డ్రోర్ ష్లోమో గోల్డ్‌స్టీన్ (Israel Man) అనే వ్యక్తి ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను ఆ చిన్నారుల తండ్రినని తెలిపాడు. బిడ్డలను రష్యాకు తరలించకుండా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఏడాది క్రితమే ఆయన తన బిడ్డలు కనిపించట్లేదంటూ గోవాలోని పానాజీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే, ఈ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. రష్యన్ మహిళ, ఆమె పిల్లలను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించొచ్చని తెలిపింది. ఇంతకాలం వారు గుహలో ఎందుకున్నారనే ప్రశ్నకు గోల్డ్‌స్టీన్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేకపోయారని పేర్కొంది. తాను రష్యాకు వీలైనంత త్వరగా వెళ్లిపోయేందుకు నీనా కూడా సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ గోల్డ్‌స్టీన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు మళ్లీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అసలు ఇలా కోరేందుకు మీకున్న హక్కు ఏమిటి? మీరు ఎవరు? మీరు ఆ బిడ్డలకు తండ్రి అనేందుకు అధికారిక డాక్యుమెంట్ ఉంటే చూపించండి. అసలు మిమ్మల్ని దేశం విడిచి వెళ్లాలని మేమెందుకు ఆదేశించవద్దో ముందు చెప్పండి’ అని న్యాయస్థానం ఆగ్రహించింది. పిల్లలు గుహలో ఉంటే మీరు గోవాలో ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ‘ఎవరు పడితే వారు ఇక్కడికి వచ్చి ఉండిపోతున్నారు. ఇలాంటి వారికి భారత్ స్వర్గ ధామంగా మారిపోయింది’ అని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోమని గోల్డ్‌స్టీన్‌కు స్పష్టం చేసింది.