Su 57 fighter program: భారత్‌కు ఎస్‌యూ 57 ఫైటర్ సాంకేతికత!
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:35 AM
త్వరలో భారత వైమానిక దళ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది. రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ ఎస్‌యూ 57 భారత సైన్యానికి అందేందుకు....
అత్యాధునిక ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేసుకునేందుకు వీలు
పూర్తిస్థాయిలో టెక్నాలజీ బదిలీకి రష్యా సుముఖత
దుబాయ్ ఎయిర్‌షోలో సంకేతాలు ఇచ్చినరష్యా రక్షణ రంగ సంస్థ రాస్‌టెక్ ప్రతినిధులు
న్యూఢిల్లీ, నవంబరు 20: త్వరలో భారత వైమానిక దళ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది. రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ ‘ఎస్‌యూ-57’ భారత సైన్యానికి అందేందుకు రంగం సిద్ధమవుతోంది. రష్యాలో ఈ ఫైటర్లను ఉత్పత్తి చేసి సరఫరా చేయడంతోపాటు భారత్‌లోనూ ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా ‘ఎస్‌యూ-57’ ఫైటర్ల పూర్తిస్థాయి సాంకేతికతను భారత్‌కు అందించేందుకు రష్యా సిద్ధమైంది. దుబాయ్‌లో జరుగుతున్న ఎయిర్‌షో-2025లో ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. రష్యా రక్షణ రంగ సంస్థ రాస్‌టెక్ సీఈవో సెర్గీ చెమెజోవ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్, రష్యా సుదీర్ఘకాలం నుంచి మంచి భాగస్వాములని.. భారత్‌పై ఆంక్షలు ఉన్న సమయంలో కూడా ఆ దేశ భద్రత కోసం రష్యా ఆయుధాలు సరఫరా చేసిందని చెప్పారు. ఇకపైనా ఈ బంధం అలాగే కొనసాగుతుందన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనాలు, సంబంధాల బలోపేతం కోసం భారత్ కోరుతున్న అన్ని రకాల రక్షణ ఉత్పత్తులను అందజేసేందుకు సిద్ధమని చెప్పారు. ఇక రాస్‌టెక్ సంస్థకు సంబంధించిన యుద్ధ విమానాలను తయారు చేసే సబ్సిడరీ సంస్థ ‘యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ)’ డైరెక్టర్ జనరల్ వాడిమ్ బడేఖా మాట్లాడుతూ.. ఎస్‌యూ-57 ఫైటర్లకు సంబంధించి భారత్ కోరుతున్న అన్ని అంశాల విషయంలో రష్యా సానుకూలంగా ఉందని, భారత అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. రష్యా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పర్యవేక్షించే రాసొబొరాన్ ఎక్స్‌పోర్ట్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎస్‌యూ-57లోని ఇంజన్లు, రాడార్లు, సాఫ్ట్‌వేర్లు, అత్యాధునిక ఆయుధాలకు సంబంధించిన సాంకేతికత కూడా భారత్‌కు బదిలీ అవుతుందని అని వెల్లడించారు.
మన రక్షణ మరింత బలోపేతం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న అత్యాధునిక ఐదోతరం యుద్ధ విమానాల్లో ఎస్‌యూ-57 కీలకమైనది. శత్రుదేశపు రాడార్లకు దొరకకుండా సమర్థమైన స్టెల్త్ సాంకేతికతలను దీనిలో వినియోగించారు. ఇలాంటి కీలక యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరితే.. మన రక్షణ మరింత బలోపేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పూర్తిస్థాయి సాంకేతికతల బదిలీతో మరింత ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.