Foreign Minister Sergey Lavrov: భారత్, చైనా.. ఎవరికీ తలొగ్గవు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:20 AM
అమెరికా అడ్డగోలు సుంకాలు, భారత్, చైనాలపై బెదిరింపులను రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. భారత్, చైనా దేశాలు ఎవరికీ తలొగ్గే అవకాశమే లేదని స్పష్టం చేసింది....
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్
మాస్కో, సెప్టెంబరు 19: అమెరికా అడ్డగోలు సుంకాలు, భారత్, చైనాలపై బెదిరింపులను రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. భారత్, చైనా దేశాలు ఎవరికీ తలొగ్గే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రష్యా మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్, చైనా రెండూ పురాతన నాగరికతలు ఉన్న దేశాలు. ‘మీరు చేసేది మాకు నచ్చడం లేదు, ఆపేయండి, లేకుంటే మీపై సుంకాలు విధిస్తా’మనే తరహా బెదిరింపులు వారిపై పనిచేయవు. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి.. బలవంతంగా ఎక్కువ ధరకు ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఇది నైతికంగా, రాజకీయంగా అమెరికాపై వ్యతిరేకత పెంచుతోందన్నది గుర్తించాలి’’ అన్నారు.