Share News

Digital Personal Data Protection: ‘డిజిటల్‌ డేటా’ సెక్షన్‌తో ఆర్‌టీఐ చట్టం నాశనం

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:57 AM

ప్రతిపక్షాలు, పౌర హక్కుల గ్రూపులు ఆర్‌టీఐ చట్టాన్ని నశింపజేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించాయి. డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టంలో ఉన్న సెక్షన్‌ 44(3) ఆర్‌టీఐ చట్టాన్ని ప్రభావితం చేస్తుందని అవన్నీ వ్యతిరేకించాయి

Digital Personal Data Protection: ‘డిజిటల్‌ డేటా’ సెక్షన్‌తో ఆర్‌టీఐ చట్టం నాశనం

44(3)ని రద్దుచేయాలి: విపక్షాలు

మెమోరాండంపై రాహుల్‌, అఖిలేశ్‌ సహా 120 మంది ఎంపీల సంతకాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టాన్ని మోదీ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ (డీపీడీపీ) చట్టంలోని సెక్షన్‌ 44 (3).. ఆర్‌టీఐ ఉసురు తీసేలా ఉందని పౌర హక్కుల గ్రూపులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. సదరు సెక్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని ఇండీ కూటమి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సమర్పించేందుకు సంయుక్తంగా మెమోరాండంను ఈ కూటమి పార్టీలు రూపొందించాయి. దానిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌, డీఎంకే నేత టీఆర్‌ బాలు సహా 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌ వెల్లడించారు. గురువారం ఢిల్లీలో ఇండీ కూటమి పార్టీల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకుండా 44(3) సెక్షన్‌ నిరోధిస్తోందని.. ఇది ఆర్‌టీఐ చట్టాన్ని తీవ్ర ప్రభావితం చేస్తోందని అన్నారు. 2023 ఆగస్టు 11న రాష్ట్రపతి ఆమోదించిన ఈ చట్టాన్ని కొంతకాలంగా తమ కూటమి అధ్యయనం చేస్తోందని తెలిపారు. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో పౌర సమాజాలు, హక్కుల గ్రూపులు తమను సంప్రదించాయని.. 8(1)(జే) సెక్షన్‌ను నీరుగారుస్తూ సెక్షన్‌ 44(3)ని తెచ్చినట్లు తెలిపాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే దానిని రద్దుచేయాలని ఐటీ మంత్రికి మెమోరాండం సమర్పించాలని నిర్ణయించామన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 05:59 AM