Share News

Roshni Nadar: దేశంలో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్‌

ABN , Publish Date - Oct 02 , 2025 | 02:56 AM

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమేరకు బుధవారం ప్రకటించిన ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌-2025 జాబితాలో...

Roshni Nadar: దేశంలో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్‌

  • 2.84 లక్షల కోట్ల సంపదతో రికార్డు సృష్టించిన హెచ్‌సీఎల్‌ చైర్‌పర్సన్‌

  • 9.55 లక్షల కోట్లతో ప్రథమ స్థానంలో ముకేశ్‌ అంబానీ

  • 8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో గౌతమ్‌ అదానీ

న్యూఢిల్లీ, అక్టోబరు 1: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమేరకు బుధవారం ప్రకటించిన ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌-2025 జాబితాలో వెల్లడించారు. 2.84 లక్షల కోట్ల సంపదతో దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో రోష్ని, ఆమె కుటుంబం మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఓ మహిళ మూడో స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. అంతేగాక తొలి పది మందిలో నిలిచిన పిన్న వయస్కురాలి(44)గానూ ఆమె రికార్డు సృష్టించారు. కెలాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన రోష్ని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడమే కాకుండా బలమైన ఐటీ సేవల సంస్థగానూ తీర్చిదిద్దారు. రోష్ని కేవలం తమ సంస్థ కార్యకలాపాలు చూడడమే కాకుండా శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విద్య, సామాజిక సేవకు భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగంలో కీలక పాత్ర వహిస్తోన్న మహిళల జాబితాలో వరుసగా నిలవడం ద్వారానూ రోష్ని ప్రత్యేకత చాటారని హురున్‌ జాబితాలో పేర్కొన్నారు. ‘టెక్నోక్రాటిక్‌ లీడర్‌షిప్‌’ మాత్రమే కాకుండా సామాజిక సేవలో ముందుండడం ద్వారా ఆమె భారతీయ పారిశ్రామికవేత్తల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు. కాగా ఈ జాబితాలో 100 మంది మహిళలు ఉండడం విశేషం. నైకా సంస్థకు చెందిన ఫల్గుణి నాయర్‌, బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా కూడా ఇందులో నిలిచారు. భారత్‌లో సంపదను సృష్టించడంలో మహిళలది కూడా కీలక పాత్రేనని చాటారు. కాగా తన సంపద విలువ 6 శాతం తగ్గినా రూ.9.55 లక్షల కోట్లతో ముకేశ్‌ అంబానీ భారత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. రూ.8.15 లక్షల కోట్లతో గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం రెండో స్థానంలో ఉంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ సైరస్‌ పూనావాలా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా, నీరజ్‌ బజాజ్‌ ఆయన కుటుంబం, దిలీప్‌ సంఘ్వీ, అజీం ప్రేమ్‌జీ ఆయన కుటుంబం, గోపీచంద్‌ హిందూజా, రాధాకిషన్‌ దమానీ కుటుంబం హురున్‌ తొలి పదిమంది భారత సంపన్నుల జాబితాలో ఉన్నారు. దేశంలో సంపన్నుల మొత్తం సంపద విలువ రూ.167 లక్షల కోట్లుగా హురున్‌ పేర్కొంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. కాగా దేశంలో రూ.1000 కోట్లు లేదా అంతకు పైగా సంపద ఉన్నవారు 1,687 మంది. గత రెండేళ్లుగా దేశం ప్రతి వారానికి ఒక బిలియనీర్‌ని సృష్టిస్తోంది. చెన్నైకి చెందిన పెర్‌ప్లెక్సిటీ స్థాపకుడు అరవింద్‌ శ్రీనివాస్‌(31) రూ.21,190 కోట్ల సంపదతో ఈ జాబితాలో చోటు సంపాదించిన యువకుడిగా నిలిచారు.

Updated Date - Oct 02 , 2025 | 02:56 AM