Robert Vadra Backs Priyanka Gandhi: ప్రజలు ప్రియాంకను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:14 AM
ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్‌కు ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్‌వాద్రా మద్దతు తెలిపారు...
ఆమెలో ఇందిరను చూస్తున్నారు: వాద్రా
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్‌కు ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్‌వాద్రా మద్దతు తెలిపారు. మంగళవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు రాజకీయ అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రియాంకలో ప్రజలు ఇందిరాగాంధీని చూస్తున్నారన్నారు. ప్రియాంక తన నాయకత్వ పటిమను ఇప్పటికే నిరూపించుకుందని వ్యాఖ్యానించారు. ప్రియాంకను అత్యున్నత పదవిలో చూడాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారని, తనను సైతం రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారంటూ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకను ముందుకు తేవాలన్నారు. కాగా, పార్లమెంట్ సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై వస్తున్న విమర్శలను వాద్రా కొట్టిపారేశారు. రాహుల్, ప్రియాంక ఇద్దరూ దేశం కోసం కష్టపడుతున్నారన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా, బీజేపీ తనను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు.