Religious Tension in Maharashtra : ముగ్గులో ఐ లవ్ మహమ్మద్ నినాదం!
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:58 AM
రోడ్డుపై ముగ్గు వేసి ఐ లవ్ మహమ్మద్ అనే నినాదాన్ని రాయడంతో మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగి ఆందోళనలకు దారి తీసింది...
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. 30 మంది అరెస్టు
ముంబై, సెప్టెంబరు 29: రోడ్డుపై ముగ్గు వేసి ‘ఐ లవ్ మహమ్మద్’ అనే నినాదాన్ని రాయడంతో మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగి ఆందోళనలకు దారి తీసింది. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి.. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఆదివారం రాత్రి అహల్యానగర్ (గతంలో అహ్మద్‌నగర్) మిల్లివాడ ప్రాంతంలో రోడ్డుపై ముగ్గుతో పాటు ‘ఐ లవ్ మహమ్మద్’ అనే నినాదాన్ని ఎవరో రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అందుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతడి సామాజిక వర్గానికి చెందిన యువకులు నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని శాంతింపజేసేందుకు యత్నించగా.. వారిపైకే రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి.. 30 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం ఫడ్నవీస్ స్పందించారు. ‘మతపర ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదు’ అని హెచ్చరించారు. కాగా, మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఈనెల 4న యూపీలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో తొలిసారి ‘ఐ లవ్ మహమ్మద్’ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో పోలీసులు 24 మందిని అరెస్టు చేయడంతో వివాదాస్పదమైంది. దీనిపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి.