Low Cost Cancer Screening Tests: రూ.10 వేల క్యాన్సర్ పరీక్ష వెయ్యికే
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:02 AM
రిలయన్స్ సంస్థ జియో తరహాలో మార్కెట్‌ను తలకిందులు చేసే మరో పెద్ద విప్లవానికి తెర తీయడానికి సిద్ధమవుతోంది....
వైద్య పరీక్షల రంగంలోకి రిలయన్స్!
న్యూఢిల్లీ, డిసెంబరు 18: రిలయన్స్ సంస్థ జియో తరహాలో మార్కెట్‌ను తలకిందులు చేసే మరో పెద్ద విప్లవానికి తెర తీయడానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తు రోగాలను ముందే గుర్తించే పదివేల రూపాయల విలువైన వైద్య పరీక్షను ఏకంగా వెయ్యి రూపాయలకే ఇవ్వాలని యోచిస్తోంది. నాలుగేళ్ల కిందట రూ.393 కోట్లతో కొనుగోలు చేసిన బెంగళూరు సంస్థ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ద్వారా ఈ డయాగ్నస్టిక్ పరీక్షల రంగంలోకి ప్రవేశించాలని రిలయన్స్ యోచిస్తోంది. ఈ సంస్థ వైద్య పరీక్షలకు జినోమిక్ సైన్స్‌ను ఉపయోగిస్తోంది. ఇందులో రక్తం లేదా లాలాజలం లేదా దేహం నుంచి తీసిన టిష్యూను శాంపిల్‌గా వినియోగిస్తారు. ఇది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్న వైద్య పరీక్షల ప్రక్రియ. రాబోయే వ్యాధులను ముందే గుర్తించడానికి జినోమిక్ సైన్స్‌ను వాడుతున్నారు. క్యాన్సర్ వచ్చిన వాళ్లకు అది ఏ స్థాయి వరకు దారి తీయొచ్చో కూడా చెప్పే విధంగా ఈ సైన్స్ అభివృద్ధి చెందుతోంది. జినోమిక్ సైన్స్ ద్వారా వ్యక్తులకు తగ్గట్లు చికిత్స ప్రణాళికలను రూపొందించవచ్చు. వ్యక్తి జన్యువు లు, క్రోమోజోముల ఆధారంగా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాలను రూపొందించవచ్చు. చౌక పరీక్షల ద్వారా సమాజం మీద తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నామని రిలయన్స్ సీనియర్ అధికారి, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంస్థ డైరెక్టర్ నీలేశ్ మోదీ అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ధరలు అందుబాటు లో ఉండాలన్న అంశంపై ముఖేశ్ అంబానీ పట్టుదలగా ఉన్నారని, అందుకే ప్రాజెక్టు ఆవిష్కరణకు టైమ్‌లైన్ పెట్టుకోలేదని వివరించారు. ప్రస్తుతం క్యాన్సర్‌ను ముందే గుర్తించే పరీక్ష విలువ రూ.10 వేలు ఉందని, దాన్ని వెయ్యి రూపాయలకు తీసుకొస్తామని స్ట్రాండ్ లైఫ్‌సైన్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. జెనెటిక్ సీక్వెన్సింగ్, క్యాన్సర్‌ను ముందే గుర్తించే పరీక్షలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ ఏడాది రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేశ్ అంబానీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జినోమిక్స్ విప్లవంతో రోగాలను నయంచేసే విధానంలో అనూహ్య మార్పులొస్తాయని, మానవుడి ఆయుర్ధాయం పెరుగుతుందని చెప్పారు.
క్యాన్సర్ స్పాట్ పాజిటివ్‌లో 30ు మందికి క్యాన్సర్
ఇప్పటికే ఈ సంస్థ రూపొందించిన క్యాన్సర్ స్పాట్ అనే ఏఐ ఆధారిత జినోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ మోడల్‌తో పది రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. అవి లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాటిక్, రొమ్ము, ఉదర క్యాన్సర్లు. ఇది స్ర్కీనింగ్ టెస్ట్ మాత్రమే. పాజిటివ్ వస్తే మరిన్ని అదనపు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాభై ఏళ్లు దాటిన వారిలో వంద మంది అనుమానితులకు పరీక్ష చేస్తే ఒకరికి క్యాన్సర్ బయట పడుతోంది. అదే క్యాన్సర్‌స్పాట్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారికి ఇతర క్యాన్సర్ పరీక్షలు చేసినపుడు వంద మందిలో 20-30 మందికి క్యాన్సర్ వచ్చినట్లు తేలుతోంది. క్యాన్సర్ స్పాట్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఇతర క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.