RBI: చెక్కుల క్లియరెన్స్ చిటికెలో..!
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:33 AM
వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో వేసే చెక్కులు పరిష్కారం అయి.. నగదు ఖాతాల్లోకి చేరేందుకు రోజుల తరబడి నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే...
సుదీర్ఘ నిరీక్షణకు ఆర్బీఐ చెక్.. వచ్చే నెల 4 నుంచి అమలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో వేసే చెక్కులు పరిష్కారం అయి.. నగదు ఖాతాల్లోకి చేరేందుకు రోజుల తరబడి నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చెక్కులు పరిష్కారం అయి, నగదు ఖాతాలో పడేందుకు రెండు నుంచి ఒక్కొక్కసారి నాలుగు రోజుల సమయం పడుతోంది. అయితే, వచ్చే నెల నుంచి ఈ నిరీక్షణ తప్పనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకువచ్చిన కొత్త నిబంధన ఖాతాదారులకు కేవలం కొన్ని గంటల్లోనే సొమ్ము చేతికి అందేలా చేయనుంది. దీని ప్రకారం ఏదైనా బ్యాంకులో చెక్కు వేసిన రోజే దానిని పరిష్కరించనున్నారు. అంతేకాదు.. చెక్కు పరిష్కారమైన గంటల వ్యవధిలోనే నిర్దేశిత బ్యాంకు ఖాతాలోకి సొమ్ము జమకానుంది. ఈ నిబంధన అక్టోబరు 4వ తేదీ నుంచి అమలులోకి రానుంది.