Share News

Rare Medical Procedure: మృతదేహానికి రక్తప్రసారం పునరుద్ధరణ!

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:14 AM

సాధారణంగా బ్రెయిన్‌డెడ్‌ అయినవారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు! అంటే.. మెదడు మాత్రమే పనిచేయడం ఆగిపోయి, మిగతా అవయవాలన్నీ యథావిధిగా పనిచేసేవారి నుంచే తీసుకుంటారు....

Rare Medical Procedure: మృతదేహానికి రక్తప్రసారం పునరుద్ధరణ!

  • అవయవదానం కోసం ఢిల్లీలోని మణిపాల్‌ వైద్యుల అరుదైన ప్రక్రియ

  • ఒక మహిళ చనిపోయిన తర్వాత కాలేయం, కిడ్నీ సేకరించిన డాక్టర్లు

న్యూఢిల్లీ, నవంబరు 8:. సాధారణంగా బ్రెయిన్‌డెడ్‌ అయినవారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు! అంటే.. మెదడు మాత్రమే పనిచేయడం ఆగిపోయి, మిగతా అవయవాలన్నీ యథావిధిగా పనిచేసేవారి నుంచే తీసుకుంటారు!! సహజమరణం పొందినవారి నుంచి అవయవాలను సేకరించరు. కానీ.. దేశంలో తొలిసారిగా సహజంగా చనిపోయిన ఒక మహిళ నుంచి అవయవాలను ఢిల్లీలోని మణిపాల్‌ వైద్యులు సేకరించారు. అందుకు వారు ఓ అరుదైన వైద్య ప్రక్రియ చేపట్టారు!! ఆమె సహజంగా కన్నుమూయగానే.. ఆమె శరీరంలోని అవయవాలు నిరుపయోగంగా మారకుండా పొత్తికడుపు భాగంలో రక్తప్రవాహాన్ని కృత్రిమంగా పునరుద్ధరించారు! అనంతరం ఆమె కాలేయం, మూత్రపిండాలను సేకరించారు. ఈ ప్రక్రియను ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అంటారు. ఇందులో భాగంగా.. సేకరించదలచుకున్న అవయవాలున్న ప్రాంతంలో పంప్‌ ద్వారా రక్తాన్ని పంపుతారు. దాంతో సదరు అవయవాల పనితీరు దెబ్బతినకుండా వెలికితీసి ఇతరులకు అమర్చవచ్చు. ఈ ప్రక్రియ ప్రపంచమంతా రెండు దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ భారతదేశంలో ఇలా చేయడం ఇదే ప్రథమం. మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌ కారణంగా చాలా ఏళ్లుగా మంచానికే పరిమితం అయిన 55 ఏళ్ల గీతాచావ్లా అవయవ దానానికి సిద్ధం అయ్యారు. భారతదేశ చట్టాల ప్రకారం బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి, గుండె కొట్టుకుంటుంటే మాత్రమే కుటుంబ సభ్యులు అవయవదానం చేయవచ్చు. గీతాచావ్లా విషయంలో.. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ఆమె నవంబరు 6వ తేదీ రాత్రి 8.43 గంటలకు సహజంగా గుండె ఆగి మరణించారు. ఐదు నిమిషాల తర్వాత.. వైద్యులు పంప్‌ ద్వారా ఆమె కాలేయం, మూత్రపిండాలకు రక్త ప్రసారాన్ని పునరుద్ధరించి, వాటిని వెలికితీసి అవసరమైన వారికి అమర్చారు. మరణించిన తర్వాత ఐదు నిమిషాలు వేచి ఉండటం ద్వారా.. చట్టపరమైన సమస్యను అధిగమించారు.

Updated Date - Nov 09 , 2025 | 01:14 AM