ఎస్‌సీవో ప్రకటనపై సంతకానికి రాజ్‌నాథ్ నో
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:36 AM
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ గురువారం నిరాకరించింది. అందులో పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో పాటు సీమాంతర ఉగ్రవాదంపై భారత్...
పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో నిరాకరణ
క్వింగ్డావో, జూన్ 26: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ గురువారం నిరాకరించింది. అందులో పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో పాటు సీమాంతర ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని స్పష్టంగా పేర్కొనకపోవడంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దానిపై సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది. అంతకుముందు చైనాలోని కింగ్డావోలో నిర్వహించిన ఎస్‌ఈవో సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ పాక్ వైఖరిని పరోక్షంగా దుయ్యబట్టారు. కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా ఉపయోగించుకుంటూ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, అలాంటి దేశాలను విమర్శించడానికి ఎస్‌ఈవో వెనుకాడకూడదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారు దాని పరిణామాలను ఎదుర్కోక తప్పదని రాజ్‌నాథ్ హెచ్చరించారు. కాగా, 2020లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా, ఉగ్రవాదంపై ఏకాభిప్రాయం సాధించడంలో ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం విఫలమైందని విదేశాంగ శాఖ పేర్కొంది.