Rajasthan Bus Accident : రాజస్థాన్‌లో మరో బస్సు ప్రమాదం 18 మంది దుర్మరణం
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:09 AM
ఏసీ బస్సు దగ్ధమైన సంఘటన మరవక ముందే రాజస్థాన్‌లో ఆదివారం మరో బస్సు ప్రమాదం సంభవించింది....
జైపూర్/పుణె/ఠాణె, నవంబరు 2: ఏసీ బస్సు దగ్ధమైన సంఘటన మరవక ముందే రాజస్థాన్‌లో ఆదివారం మరో బస్సు ప్రమాదం సంభవించింది. నిలిపి ఉన్న ట్రయిలర్‌ను బస్సు ఢీకొనడంతో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజధాని జైపూర్‌కు 400 కి.మీ.దూరంలోని ఫాలోడి జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పర్యాటక కేంద్రమైన జోధ్‌పూర్ జిల్లాలోని సుర్‌సాగర్, బికనేర్ జిల్లాలోని పుణ్యక్షేత్రమైన కోలాయత్‌లను సందర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం భజన్‌లాల్ శర్మ తెలిపారు. ఈ బస్సు ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తపరిచారు. పీఎం సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గత నెలలో జైసల్మేర్ జిల్లాలో ఏసీ బస్సులో మంటలు వ్యాపించడంతో 26 మంది మరణించారు. అప్పటి నుంచి అధికారులు బస్సులను తనిఖీలు చేస్తున్నప్పటికీ ప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు, మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం వేకువజామున అతి వేగంగా వెళ్తున్న కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మద్యం సేవించి కారును నడపడమే ఈ ప్రమాదం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. థానేలో మోటారు సైకిల్‌ను ఓ లారీ ఢీకొనడంతో రెండున్నర ఏళ్ల బాలుడు సంఘటన స్థలంలోనే మరణించాడు.