Railways to Prepare Reservation Charts: పది గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్టు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:29 AM
ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టు సిద్ధం కానుంది. ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించి, వారు మరింత సజావుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించేందుకు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, డిసెంబరు 17: ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టు సిద్ధం కానుంది. ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించి, వారు మరింత సజావుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వేశాఖ తొలిసారిగా రిజర్వేషన్ చార్టు రూపొందించే సమయాన్ని సవరించింది. ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి 4గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్జును సిద్ధం చేసేవారు. దీంతో ప్రత్యేకించి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల్లో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగేది. పది గంటలు ముందుగా చార్టు సిద్ధం చేయడం వల్ల తాత్కాలిక బస, రైల్వేస్టేషన్‌కు చేరుకునే ఏర్పాట్లు, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రయాణికులకు అవకాశం కలుగుతుందని రైల్వేశాఖ పేర్కొంది. అన్ని రైల్వే జోన్లు దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
పరిమితి దాటిన లగేజీకి చార్జీ
రైల్లో ప్రయాణించే సమయంలో నిర్దేశిత బరువు దాటిన లగేజీకి చార్జీలు చెల్లించాల్సిందేనని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభకు తెలిపారు. విమానాల్లో వలే రైళ్లలోనూ లగేజీకి నిబంధనలను అమలు చేయనున్నారా? అని టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం క్లాస్ వైజ్‌గా రైళ్లలో లగేజీకి కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌లో నగదు జమచేసిన వ్యక్తులు ఆ డబ్బును రైలు టికెట్లు కొనేందుకు మాత్రమే ఉపయోగించుకోగలరని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చిచెప్పారు. అయితే, ఈ-వాలెట్‌ను రద్దు(క్లోజ్) చేసుకున్నప్పుడు అందులోని డబ్బును వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని తెలిపారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మరోవైపు, రైలు ప్రమాదాలను నివారించేందుకు కవచ్ వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 2 వేల కిలోమీటర్ల పరిధికి మించి కవచ్ వ్యవస్థ అమలవుతోందన్నారు.
రిజర్వేషన్ చార్టు సిద్ధంచేసే కొత్త సమయాలు ఇవీ..
ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ఇకపై తొలి రిజర్వేషన్ చార్టును ముందురోజు రాత్రి 8 గంటలకే తయారు చేయనున్నారు.
మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 గంటల మధ్య, అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరాల్సిన రైళ్లకు 10 గంటలు ముందుగా తొలి రిజర్వేషన్ చార్టును రూపొందిస్తారు.