Rail Loco Pilots Demand Fixed Work Hours: ఇండిగో సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోండి
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:10 AM
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం వేళ.. రైలు డ్రైవర్లు కూడా పనిగంటల విషయంలో పలు డిమాండ్లు వినిపించారు. అలసటను తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి.....
రైలు డ్రైవర్లకు కూడా పరిమిత పని గంటలు ఉండాలి
రైల్వే శాఖకు లోకోపైలట్ల డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం వేళ.. రైలు డ్రైవర్లు కూడా పనిగంటల విషయంలో పలు డిమాండ్లు వినిపించారు. అలసటను తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి తమకు కూడా పరిమిత పని గంటలు ఉండాలని స్పష్టం చేశారు. రైల్వేలో లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే పోరుబాటలో ఉన్న వారు.. హేతుబద్ధమైన పని గంటలు, శాస్త్రీయ రోస్టర్ ప్రణాళికతో పాటు మెరుగైన కార్మిక సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాలని రైల్వే శాఖకు సూచించారు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో సహనం ప్రదర్శిస్తోందని, ప్రభుత్వ లోకోపైలట్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటోందని ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎ్‌సఏ) న్యూస్18 మీడియా కథనం వేదికగా విమర్శించింది. ఎంతో కాలం నుంచి లోకో పైలెట్లు ఎదుర్కొంటున్న సమస్యలే ఎయిర్‌లైన్స్‌లో ప్రస్ఫుటంగా కనిపించాయని ఆ యూనియన్ తెలిపింది. ఫేటిగ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎంఎస్) ఆధారిత పనిగంటల వ్యవస్థను రైల్వే అవలంభించాలని, రోజు వారీగా ఆరు గంటల పని, ప్రతి షిఫ్ట్ తర్వాత 16 గంటల విశ్రాంతి తదితర అంశాలను ఆ యూనియన్ ప్రస్తావించింది.