Share News

Rahul Gandhi: కశ్మీర్‌లో రాహుల్‌ పర్యటన

ABN , Publish Date - May 25 , 2025 | 04:26 AM

రాహుల్‌ గాంధీ జమ్మూకశ్మీర్ పూంచ్‌ జిల్లాలో పాకిస్థాన్‌ షెల్లింగ్‌ దాడుల ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితుల సమస్యలను జాతీయ స్థాయిలో ఎత్తిపడతానని హామీ ఇచ్చారు.

Rahul Gandhi: కశ్మీర్‌లో రాహుల్‌ పర్యటన

పాకిస్థాన్‌ దాడుల బాధిత కుటుంబాలకు భరోసా

న్యూఢిల్లీ, మే 24: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంఽధీ శనివారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో పర్యటించారు. ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ బలగాలు చేసిన షెల్లింగ్‌ దాడుల ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఏ మూల చూసినా ధ్వంసమైన ఇళ్లులు, తడిబారిన కళ్లు, ప్రియమైన వారిని కోల్పోయిన బాధాతప్త హృదయాలే కనిపించాయని పేర్కొన్నారు. బాధితుల ఆందోళనలు, సమస్యలను జాతీయ స్థాయిలో లేవనెత్తుతానని వారికి భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న రాహుల్‌ గాంధీ.. ఈనెల 8, 10వ తేదీల మధ్య పాక్‌ జరిపిన దాడుల్లో దెబ్బతిన్న ఇంటింటికీ తిరిగారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షెల్లింగ్‌లో గాయపడిన వారిని ఆస్పత్రుల్లో పరామర్శించారు. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలను కూడా సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు.


తడిబారిన కళ్లు... బాధాకర స్టోరీలు

బాధిత కుటుంబాలను కలిసిన అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ఇది ఒక పెద్ద విషాదం. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నష్టం కూడా భారీగా జరిగింది. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని వారు కోరారు. నేను ఆ పని చేస్తాను’ అని పేర్కొన్నారు. ఈ దేశభక్తి కుటుంబాలు ప్రతిసారీ ధైర్యం, గౌరవంతో యుద్ధ భారాన్ని మోస్తాయని, వారి ధైర్యానికి సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ బలగాల ఆర్టిలరీ, మోర్టార్‌ షెల్లింగ్‌, క్షిపణులు, డ్రోన్‌ దాడుల్లో పూంచ్‌ సెక్టార్‌ ఎక్కువగా ప్రభావితమైంది. మొత్తం 28 మంది మరణించగా, పూంచ్‌ జిల్లాలోనే 13 మంది మృతిచెందారు. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా 70 మందికి పైగా గాయపడ్డారు. కాగా, రాహుల్‌ గాంధీ అంతకుముందు పహల్గాం దాడి తర్వాత ఏప్రిల్‌ 25న శ్రీనగర్‌లో పర్యటించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను రాహుల్‌ గాంధీ శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 04:26 AM