Share News

Rahul Gandhi Slams: మహాత్ముడి ఆదర్శాలకు అవమానం

ABN , Publish Date - Dec 17 , 2025 | 03:57 AM

పూజ్య బాపూజీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా.. మోదీ సర్కారు ఉపాధి హామీ చట్టానికున్న ఆయన పేరును మారుస్తూ వీబీ-జీరామ్‌జీ బిల్లును తీసుకొచ్చిందని లోక్‌సభలో విపక్ష నేత.....

Rahul Gandhi Slams: మహాత్ముడి ఆదర్శాలకు అవమానం

  • ఉపాధి హామీ చట్టం పేరు మార్చడంపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం

  • విపక్షాల నిరసనల మధ్య ‘వీబీ-జీరామ్‌జీ’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌

  • నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన

న్యూఢిల్లీ, డిసెంబరు 16: పూజ్య బాపూజీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా.. మోదీ సర్కారు ఉపాధి హామీ చట్టానికున్న ఆయన పేరును మారుస్తూ వీబీ-జీరామ్‌జీ బిల్లును తీసుకొచ్చిందని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. తీవ్రమైన నిరుద్యోగం ద్వారా ఇప్పటికే దేశ యువత భవితను నాశనం చేసిన మోదీ సర్కారు.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు ఉపాధిహామీ చట్టం ద్వారా లభిస్తున్న భద్రమైన జీవనోపాధిని సైతం తొలగించేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్‌ భారత్‌- గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌-గ్రామీణ్‌’ (వీబీ-జీరామ్‌జీ)’గా మార్చి, పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతూ రూపొందించిన బిల్లును.. కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంగళవారం విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గాంధీజీ పేరు తొలగింపుపై విపక్షనేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తమ ప్రభుత్వానికి మహాత్మాగాంధీపై విశ్వాసం ఉందని, బాపూజీ సిద్ధాంతాలను పాటిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వాల కన్నా మోదీ సర్కారే ఎక్కువ కృషి చేసిందని పేర్కొన్నారు. కానీ, మోదీ మొదట్నుంచీ ఉపాధి హామీ పథకం(మన్రేగా)పై అసహనంతో ఉన్నారని.. గడిచిన పదేళ్లుగా దాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ‘‘ఈరోజు మన్రేగాను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఆయన కంకణం కట్టుకున్నారు’’ అని ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ ప్రజా వ్యతిరేక బిల్లును కాంగ్రెస్‌ పార్టీ గ్రామస్థాయి నుంచి పార్లమెంటు దాకా వ్యతిరేకిస్తోందని రాహుల్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో మంగళవారం ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు.. విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాన్ని పార్లమెంటరీ ప్యానెల్‌ పరిశీలన నిమిత్తం పంపాలని డిమాండ్‌ చేశారు.


ఉపాధి హమీ చట్టం పేరు నుంచి మహాత్ముడి పేరు తొలగించడంపై కాంగ్రెస్‌ ఎంపీలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు తదితర విపక్ష ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పలువురు విపక్ష ఎంపీలు మహాత్మాగాంధీ ఫొటోలు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ‘వీబీ-జీరామ్‌జీ’ బిల్లు పేదల ఉపాధి హక్కులను బలహీనపరిచేలా ఉందని, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని ప్రియాంక ధ్వజమెత్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులకు సంబంధించి 90 శాతం నిధులను కేంద్రమే ఇస్తుందని.. కొత్త బిల్లులో దాన్ని 60 శాతానికి కుదించారని, రాష్ట్రాల ఆర్థికస్థితిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వెలిబుచ్చారు. మహాత్మాగాంధీ తమ కుటుంబానికి చెందినవారు కాదని.. దేశంలోని ప్రతి కుటుంబానికీ చెందినవారని ఆమె గుర్తుచేశారు. ‘‘మోదీ సర్కారుకున్న ఈ పథకాల పేర్లు మార్చడమనే అబ్సెషన్‌ ఏమిటో నాకు అర్థం కావట్లేదు’’ అని వ్యాఖ్యానించారు. గతంలో ఈ పథకం కింద ఊళ్లో ఏ పనులు చేపట్టాలో గ్రామపంచాయతీ నిర్ణయించేదని.. కానీ ఈ బిల్లు ఆ హక్కుతో పాటు, నిధులను ఎలా కేటాయించాలనే హక్కును కూడా కేంద్రానికి దఖలుపరుస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌.. 1971లో వచ్చిన ‘హరే కృష్ణ హరే రామ్‌’ సినిమాలోని ‘‘రామ్‌ కా నామ్‌ బదనామ్‌ నా కరో’’ పాటను గుర్తుచేశారు. ఉపాధిహామీ పథకం పేరు మారుస్తూ తెచ్చిన ఈ బిల్లు కేవలం పాలనాపరమైన మార్పు మాత్రమే కాదని.. ఈ పథకం ఆత్మపైన, తాత్వికపునాది మీద జరిగిన దాడి అని విమర్శించారు. కాగా.. ‘వీబీ-జీరామ్‌జీ’ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఈమేరకు ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌.. అన్ని రాష్ట్రల కాంగ్రెస్‌ అధ్యక్షులకూ లేఖలు రాశారు.

Updated Date - Dec 17 , 2025 | 03:57 AM