Congress leader Rahul Gandhi: ఉన్నావ్ దోషి విడుదల సిగ్గుచేటు
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:01 AM
ఉన్నావ్ అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగార్‌ను విడుదల చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సెంగర్‌కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితురాలు....
నేరస్థుడికి బెయిల్ ఇచ్చి బాధితులను నేరస్థులుగా చూస్తారా?
ఇదేనా న్యాయం?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉన్నావ్ అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగార్‌ను విడుదల చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సెంగర్‌కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితురాలు, ఆమె తల్లి నిరసన చేస్తున్న క్రమంలో వారితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల బాధితురాలిని లాక్కెళ్తున్న వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేస్తున్న ఓ అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరించడం సమంజసమేనా..? న్యాయం కోసం గళం వినిపించడమే ఆమె చేసిన తప్పా..? అని ప్రశ్నించారు. ‘బాధితురాలు పదే పదే వేధింపులకు గురవుతూ భయంతో జీవిస్తోంది. ఈ సమయంలో కేసులో ప్రధాన నిందితుడు(మాజీ బీజేపీ ఎమ్మెల్యే సెంగార్)కు బెయిల్ లభించడం అత్యంత విచారకరం. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇచ్చి స్వేచ్ఛగా తిరగమని చెప్పడం, బాధితులను నేరస్థులుగా చూడడం.. ఇదేం న్యాయం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఉన్నావ్ కేసు బాధితురాలు, ఆమె తల్లి బుధవారం సాయంత్రం రాహుల్‌తో సమావేశమయ్యారు. గంటకు పైగా జరిగిన భేటీలో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, పోలీసులు వారి పట్ల వ్యవహరించిన తీరును వివరించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాహుల్ భరోసానిచ్చారు. త్వరలో ప్రధాని మోదీని కూడా కలుస్తామని బాధితురాలు ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, ఉన్నావ్ బాధితురాలు, ఆమె తల్లిని ఢిల్లీలో మీడియాతో మాట్లాడకుండా సీఆర్‌పీఎఫ్ పోలీసులు అడ్డుకోవడం.. బాధితురాలి తల్లిని మోచేతులతో నెట్టేస్తూ దురుసుగా ప్రవర్తించడం షాక్‌కు గురి చేసింది. ఇండియా గేట్ వద్ద నిరసన తెలిపిన బాధితురాలు, ఆమె తల్లిని మంగళవారం రాత్రే బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామన్నారు.