Rahul Gandhi : భేష్! మనం బాగా పని చేశాం!
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:16 AM
వందేమాతరం, ఎన్నికల సంస్కరణల అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వ వాదనను ప్రతిపక్షాలు చిత్తు చేశాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు....
వందేమాతరం, ఎస్‌ఐఆర్‌లపై ప్రభుత్వ వాదనను తిప్పికొట్టాం
కాంగ్రెస్ ఎంపీలతో భేటీలో రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, డిసెంబరు 12: వందేమాతరం, ఎన్నికల సంస్కరణల అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వ వాదనను ప్రతిపక్షాలు చిత్తు చేశాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. విపక్షాల దాడితో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయి ఒత్తిడిని ఎదుర్కొందన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో.. కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలతో రాహుల్‌గాంధీ శుక్రవారం సమావేశమయ్యారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం, పార్లమెంటు కాంప్లెక్స్ ఆవరణలో మీడియాతో మా ట్లాడుతూ, 150 ఏళ్ల వందేమాతరం, ఎస్‌ఐఆర్ ప్రక్రియలపై పార్లమెంటులో పోటాపోటీగా సాగిన చర్చ తనకు బాగా నచ్చిందని, అధికారపక్షం వాదనను తాము తుత్తునియలు చేశామన్నారు. ఎస్‌ఐఆర్‌పై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గందరగోళంగా కనిపించారని, అందువల్లే ఓ అనుచిత పదాన్ని కూడా ఉపయోగించారని రాహుల్ విమర్శించారు. ‘ఆయన మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు. దానికి కారణం ఉంది. ఓట్‌చోరీ గురించి ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయింది’ అని పేర్కొన్నారు. ఓట్‌చోరీ అంశంపై చర్చకు రావాలని రాహుల్‌గాంధీ సవాల్ చేసినప్పుడు అమిత్‌షా వణికిపోయారని లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ ఎద్దేవా చేశారు.
హాజరుకాని శశిథరూర్
కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ హాజరుకాలేదు. శుక్రవారం ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉందని, తన సోదరి పుట్టినరోజు వేడుక కూడా ఉందని ఎక్స్‌లో శశిథరూర్ ఓ పోస్ట్ పెట్టారు. పార్టీ సమావేశానికి ఆయన గైర్హాజరు కావటం ఈ మధ్య కాలంలో ఇది మూడోసారి. గత నెలలో సోనియాగాంధీ, మల్లికార్జునఖర్గే అధ్యక్షతన జరిగిన రెండు సమావేశాలకూ ఆయన హాజరు కాలేదు. అక్టోబరులో జరిగిన కాంగ్రెస్ కేరళ శాఖ సమావేశంలో మాత్రం ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావటానికి ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఆ భేటీలో వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా పాల్గొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తే తనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని శశిథరూర్ డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు సిద్ధంగా లేదని సమాచారం.