Share News

Rahul Gandhi Raises Objections: సీఐసీ నియామకంపై రాహుల్‌ అసమ్మతి నోట్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:42 AM

కేంద్ర సమాచార కమిషనర్ల నియామకంపై బుధవారం ఏర్పాటైన కేంద్ర కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.....

Rahul Gandhi Raises Objections: సీఐసీ నియామకంపై రాహుల్‌ అసమ్మతి నోట్‌

  • కమిషనర్ల నియామకాలపై ఎటూ తేల్చని కమిటీ భేటీ!

  • కేంద్రం ప్రతిపాదించిన పేర్లపై రాహుల్‌గాంధీ అసంతృప్తి

  • సమావేశంలో పాల్గొన్న ప్రధాని, హోంమంత్రి

  • ముఖ్య సమాచార కమిషనర్‌తోపాటు 8 మంది కమిషనర్ల పోస్టులు ఖాళీ.. పెండింగ్‌లో 30 వేలకు పైగా కేసులు!

న్యూఢిల్లీ, డిసెంబరు 10 : కేంద్ర సమాచార కమిషనర్ల నియామకంపై బుధవారం ఏర్పాటైన కేంద్ర కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. కేంద్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న ముఖ్య సమాచార కమిషనర్‌(సీఐసీ) పోస్టుతోపాటు మరో 8 మంది కమిషనర్లు, ఒక విజిలెన్స్‌ కమిషన్‌ సభ్యుడిని ఈ కమిటీ నియమించాల్సి ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బుధవారం పార్లమెంటులోని ప్రధాని చాంబర్‌లో భేటీ అయ్యింది. దాదాపు గంటన్నర సాగిన వారి సమావేశం సమాచార కమిషనర్ల నియామకంపై ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఇందులో పాల్గొన్న రాహుల్‌గాంధీ నియామకాలపై తన అసమ్మతి నోట్‌ని ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. కాగా ప్రధాని నేతృత్వంలోని సమాచార కమిషనర్ల నియామక కమిటీ ఈ నెల 10వ తేదీన సమావేశమై నియామకాలపై నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీనే సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కాగా కాంగ్రెస్‌ గతంలోనూ(2020) సీఐసీ నియామక ప్రక్రియను తప్పుబట్టింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించింది. కేంద్ర సమాచార కమిషన్‌ వద్ద ప్రస్తుతం 30,838 కేసులు పెండింగ్‌లో ఉండగా కేవలం ఇద్దరు కమిషనర్లు ఆనంది రామలింగం, వినోద్‌ కుమార్‌ తివారి మాత్రమే అందుబాటులో ఉన్నారు. సీఐసీగా ఉన్న హీరాలాల్‌ సమారియాకు 65 ఏళ్లు నిండడంతో సెప్టెంబరు 13వ తేదీన పదవీ విరమణ చేశారు. కాగా, సీఐసీ నియామకంపై ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ 88 నిమిషాలపాటు భేటీ కావడంపై పార్లమెంటు కారిడార్‌లలో ఎంపీల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగింది. రాహుల్‌గాంధీ బయటకు వచ్చాకగానీ.. వారికి ఈ సమావేశం కేవలం సీఐసీ నియామకంపైనే కాదని, మరో 8 మంది సమాచార కమిషనర్లతోపాటు ఒక విజిలెన్స్‌ కమిషనర్‌ నియామకంపైజరిగిందన్న విషయం తెలియలేదు. ఆ నియామకాలన్నిటిపై రాహుల్‌ తన అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 11 , 2025 | 04:42 AM