Rahul Gandhi: రాహుల్ నాయకత్వానికి తీవ్ర అగ్ని పరీక్ష
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:19 AM
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ మరోసారి బిహార్‌లో ఘోరపరాజయం కావడంతో ఆయన నాయకత్వానికి తీవ్ర అగ్నిపరీక్ష ఎదురుకానుంది...
న్యూఢిల్లీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ మరోసారి బిహార్‌లో ఘోరపరాజయం కావడంతో ఆయన నాయకత్వానికి తీవ్ర అగ్నిపరీక్ష ఎదురుకానుంది. పార్టీయే కాక ఇండియా కూటమి కూడా రాహుల్ నాయకత్వంలో విజయాలు సాధించలేదనే చర్చ జరుగుతోంది. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అయినప్పటికీ పార్టీలో అనేక కీలక నిర్ణయాలు రాహుల్ మాత్రమే తీసుకోవడం, ఆయన టీమ్ సభ్యులే అన్ని విషయాల్లో చక్రం తిప్పుతుండటం మూలంగా బిహార్‌లో ఓటమికి రాహుల్ నైతిక బాధ్యత వహించక తప్పదన్న చర్చ జరుగుతోంది. బిహార్‌లో సీట్ల పంపిణీ, పొత్తు నుంచి ప్రచార సరళి వరకు రాహుల్ నిర్ణయించారని, అన్ని నిర్ణయాలు ఆయన నియమించిన ఇన్‌చార్జి కృష్ణ అల్లవారు, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీసుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. సీట్ల పొత్తు విషయంలో చివరి వరకు కృష్ణ అల్లవారు నాన్చడం, దానికి వేణుగోపాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేక మంది మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్లకు టికెట్లు దక్కలేదు. మరోవైపు 9 నియోజకవర్గాల్లో మిత్రపక్షాలతోనే పోటీ పడాల్సి రావడం, తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు చివరి నిమిషం వరకు వెనుకాడటం మూలంగా మహాగఠ్‌బంధన్ విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘ఇండియా కూటమి’ నాయకత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వయోభారంతో సతమతమవుతున్న ఖర్గేతో రాజీనామా చేయించి మరొకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చాలా రోజులుగా పార్టీలో చర్చ జరుగుతోంది. బహుశా ప్రియాంకాగాంధీ వాద్రాకు ఆ బాధ్యతలు అప్ప జెప్పి పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. కాగా శుక్రవారం ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ అప్రతిహత విజయం సాఽధిస్తోందని తెలియడంతో రాహుల్ గాంధీ తీవ్ర షాక్‌కు గురైనట్లు తెలిసింది. ఆయన ఏ వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటించారు.