Share News

Rahul Gandhi: మ్యాచ్‌ఫిక్సింగ్‌ గుత్తాధిపత్యం వల్లే ఇండిగో సంక్షోభం

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:23 AM

మోదీ ప్రభుత్వ గుత్తాధిపత్య విధానం వల్లే ‘ఇండిగో’ సంక్షోభం తలెత్తిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతి రంగంలోనూ...

Rahul Gandhi: మ్యాచ్‌ఫిక్సింగ్‌ గుత్తాధిపత్యం వల్లే ఇండిగో సంక్షోభం

న్యూఢిల్లీ, డిసెంబరు 5: మోదీ ప్రభుత్వ గుత్తాధిపత్య విధానం వల్లే ‘ఇండిగో’ సంక్షోభం తలెత్తిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతి రంగంలోనూ న్యాయబద్ధమైన పోటీ ఉండాలని.. మ్యాచ్‌ఫిక్సింగ్‌తో కూడిన గుత్తాధిపత్యాలు పనికిరావని శుక్రవారం ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు. ఇండిగో సంస్థ గురు, శుక్రవారాల్లో భారీగా విమాన సర్వీసు లను రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగడం తెలిసిందే. దీనిపై రాహుల్‌ తీవ్రంగా స్పందించారు. విమానాల ఆలస్యం, రద్దు, నిస్సహాయత కారణంగా సాధారణ భారతీయులు మూల్యం చెల్లించుకుంటున్నారని తెలిపారు. ఈస్టిండియా కంపెనీ 150ఏళ్ల కిందటే దేశం దాటి వెళ్లిపోయిందని.. ఇన్నేళ్లకు కొత్త జాతి ఏకస్వామ్యవాదులు దాని స్థానంలో వచ్చారంటూ గత ఏడాది ఓ పత్రికకు తాను రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా ఆయ న షేర్‌ చేశారు. ‘విమానాశ్రయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది గుత్తాధిపత్యం లేదా ఏకాధిపత్యం ఫలితమే. స్లిప్పర్లు వేసుకునేవారు విమానాలు ఎక్కుతారని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది పరస్పరం బూట్లు, చెప్పులు విసురుకుంటున్నారు’ అని ఏఐసీసీ మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్‌ ఖేరా ఎద్దేవాచేశారు. దేశంలో చాలా రంగాలు కొద్ది మంది చేతుల్లోనే ఉన్నాయని, ఈ ప్రభుత్వం వల్లే ఇలా జరుగుతోందని.. ఇది ఆర్థిక వ్యవస్థకు, ప్రజాసామ్యానికి, దేశానికీ ఆరోగ్యకరంకాదని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. విమానయాన పరిశ్రమలో ఒకప్పుడు పోటీ ఉండేదని.. మోదీ ప్రభుత్వం దాన్ని రెండు కంపెనీల చేతుల్లో పెట్టిందని.. ప్రయాణికుల ప్రయోజనాలకంటే కార్పొరేట్‌ పేరాశకే ప్రాధాన్యమిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ధ్వజమెత్తారు.

Updated Date - Dec 06 , 2025 | 04:23 AM