Rahul Gandhi Alleges BJP Engaged in Vote Fraud: సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:17 AM
దేశంలో సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో పోరాడడం ద్వారానే..
బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ.. కాంగ్రెస్‌లో సత్యం, అహింస
ఆ రెండింటి ద్వారానే పోరాడి.. మోదీని ఓడించి.. గద్దె దించుతాం
కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తోంది
ఓట్‌చోరీలో దొరికిపోయామని మోదీ, షాలకు అర్థమైంది
సభలో నా ప్రశ్నకు జవాబిస్తున్నప్పుడు షా చేతులు వణికాయి
సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు.. కానీ తుది గెలుపు మాదే
‘ఓట్ చోర్-గద్దీ ఛోడ్’ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
దశలవారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర: మల్లికార్జున ఖర్గే
దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి: ప్రియాంక
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మాగాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో పోరాడడం ద్వారానే.. నరేంద్ర మోదీ, ఆర్‌ఎ్‌సఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో సత్యం, అహింస ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ఆదివారం న్యూఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ మెగా ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వీ, జైరాం రమేశ్, చిదంబరం సహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కీలక నేతలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మెగా ర్యాలీకి ముందు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో కలిసి రాహుల్ గాంధీ విందు చేశారు. అక్కడి నుంచి నేరుగా ర్యాలీకి చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలతోపాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. సభలో ప్రసంగించిన రాహుల్‌గాంధీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లు ప్రస్తావించి మరీ.. వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. తాము పనిచేసేది దేశం కోసమని, మోదీ కోసం కాదని సత్యాన్ని ఇకనైనా వారు గ్రహించాలని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో ఓటర్లకు రూ.10వేల చొప్పును బీజేపీ బదిలీ చేసినా.. ఈసీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ‘‘సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న పోరులో.. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీతో కలిసి పనిచేస్తోంది. కేంద్రం చెప్పినట్లే చేస్తోంది. మేము.. నిస్సందేహంగా సత్యం వైపు నిలబడ్డాం. నరేంద్ర మోదీ, ఆర్‌ఎ్‌సఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేస్తాం. వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ చేరీకి పాల్పడుతున్నారు. కానీ.. మాకు ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై నమ్మకం ఉంది.
ఈ పోరాటంలో విజయం సాధించడానికి, సత్యం గెలవడానికి సమ యం పట్టొచ్చు. కానీ.. అంతిమ విజయం సత్యానిదే. సత్యం, అహింస మార్గంలోనే మేం పనిచేస్తాం’’ అని రాహుల్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సభ్యులపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా కేంద్రం ఓ చట్టా న్ని తీసుకొచ్చిందని.. కానీ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని మారు స్తామన్నారు.
దొరికిపోయామనిగ్రహించారు..
‘ఓట్ చోరీ’ విషయంలో తాము దొరికిపోయినట్టు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ నాయకులు గ్రహించారని రాహుల్ గాంధీ తెలిపారు. అందుకే మోదీతోపాటు ఆ పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం సడలిందన్నారు. లోక్‌సభలో ‘ఓట్ చోరి’పై చర్చ సందర్భంగా తన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నప్పుడు అమిత్ షా చేతులు అందుకే వణికాయన్నారు. బీజేపీ నాయకుల ఆత్మవిశ్వాసం, ధైర్యం కేవలం అధికారం నుంచే వస్తాయని, ఓట్ చోరీతో వాళ్లు ఆ అధికారం దక్కించుకున్నారని మండిపడ్డారు. ‘‘మోదీ, షా... మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా, అంతిమంగా సత్యానిదే విజయం... మేం మిమ్మల్ని సత్యం, అహింసతో ఓడిస్తాం,’’ అని రాహుల్ హెచ్చరించారు. కాగా.. దశలవారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ కుట్ర పన్నుతున్నాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
దశలవారీగా రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు
‘‘బీజేపీది ఆర్‌ఎ్‌సఎస్ సిద్థాంత కర్త గోల్వాల్కర్, మోహన్ భాగవత్, మనుస్మృతి భావజాలం. ఆ ఆలోచనా విధానం దేశాన్ని కాపాడదు. నాశనం చేస్తుంది. మోదీ, బీజేపీ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. దశలవారీగా రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. హిందూ మతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చే సమయానికి నరేంద్ర మోదీ, అమిత్ షా పుట్టారా అని నిలదీశారు. ‘‘బీజేపీ వాళ్లు ద్రోహులు, నాటకాలు ఆడేవారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీ పార్లమెంటుకు రారు. మేము అడిగే ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పరు. వందే మాతరంపై దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’’ అని నిప్పులు చెరిగారు. ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడాలంటే.. ‘ఓట్ చోరీకి’ పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని కాపాడగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. అందుకే కాంగ్రెస్ సిద్థాంతాన్ని ఐక్యంగా బలోపేతం చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ‘‘140 కోట్ల మంది ప్రజలను కాపాడటం ఎంతో ముఖ్యం. దేశంలో ధనవంతులు, పేదల మధ్య పోరా టం జరుగుతోంది. బీజేపీకి పేదల గోడు ఎప్పుడూ పట్టదు. కార్పొరేట్ శక్తులవైపే నిలుస్తుంది. ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ వంటి దేశద్రోహులు, ఓట్లను చోరీ చేసేవాళ్లకు వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. ఈ పోరాటానికి మీరు మరింత బలోపేతం చేకూర్చాలి. గ్రామగ్రామానికీ వెళ్లి ఈ విషయాలు తెలియజేయాలి.’’ అని ఖర్గే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక.. ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయట్లేదనే విష యం దేశంలోని ప్రతిఒక్కరికీ తెలుసని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘ఎన్నికలకు ముందు ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు వేయడం ఓట్ చోరీ కాదా?’’ అని ఆమె ప్రశ్నించారు. బిహార్‌లో ఓట్ చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దమ్ముంటే.. బ్యాలెట్ విధానంలో పోటీ చేసి ఎన్నిక ల్లో గెలవాలని బీజేపీకి ఆమె సవాల్ విసిరారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని ప్రియాంక పిలుపునిచ్చారు.
అదే వారి సిద్ధాంతం..
‘‘ప్రపంచం సత్యం వైపు చూడదు. అధికారం వైపు మాత్రమే చూస్తుంది. అధికారం ఉన్నవాడినే గౌరవిస్తుంది’’ అని ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గుర్తు చేశారు. ఇదే మోహన్ భాగవత్ ఆలోచన, ఆర్‌ఎ్‌సఎస్ సిద్ధాంతమని విమర్శించారు. ప్రపంచంలోని ప్రతి మతం సత్యమే ప్రధానమని చెబుతుందని, కానీ.. సత్యానికి అర్థమేలేదని, అధికారమే కీలకమని మోహన్ భగవత్ అంటున్నారని మండిపడ్డారు. ‘‘ఈ దేశం ‘సత్యం, శివం, సుందరం’.. ‘సత్యమేవ జయతే’ అనే తత్వాలపై ఆధారపడి నడుస్తుంది. చివరికి కాంగ్రెస్ సత్యం, అహింసతోనే మోదీని, బీజేపీని ఓడించి గద్దె దించుతుంది. దీనికోసం కాంగ్రెస్ శాంతియుత, ప్రజాస్వామిక పంథాలోనే పోరాటం సాగిస్తుంది. సత్యాన్ని ఆచరిస్తూ, సత్యాన్ని అంటిపెట్టుకుని, సత్యాన్ని ఆయుధంగా చేసుకుంటే నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్‌ఎ్‌సఎస్ ను ఈ దేశం నుంచే తరిమెయ్యొచ్చు.’’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ చోరీపై ఆధారాలతో సహా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. హరియాణా ఓటర్ల జాబితాలో ఒక బ్రెజిలియన్ మహిళ ఫోటో 22సార్లు ఎలా కనిపించిందో, అదే రాష్ట్రంలోని ఒకే పోలింగ్ బూత్‌లో ఒక మహిళ ఫోటో 200సార్లు ఎలా ఉందో, యూపీకి చెందిన బీజేపీ కార్యకర్తలు హరియాణా ఎన్నికల్లో ఎలా ఓటేశారో? తాళం వేసిన ఒకే ఇంట్లో 600, 700 మంది ఓట్లరు ఎలా ఉన్నారో? ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.