Rahul Gandhi : ఓట్ చోరీ.. అతిపెద్ద దేశద్రోహ చర్య
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:01 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి ఓట్ చోరీ చేయడం ద్వారా అతిపెద్ద దేశద్రోహ చర్యకు పాల్పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు....
ఈసీతో కలిసి బీజేపీ చేస్తోంది అదే..: రాహుల్
న్యూఢిల్లీ, డిసెంబరు 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి ఓట్ చోరీ చేయడం ద్వారా అతిపెద్ద దేశద్రోహ చర్యకు పాల్పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి బీజేపీ ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. ఎన్నికల సంస్కరణలపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. సీఈసీని కాపాడేందుకు ఏకంగా చట్టాలనే మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల చోరీపై తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్రానికి మూడు ప్రశ్నలు వేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను నిర్ధారించే యంత్రాంగాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా? సర్ ప్రక్రియపై అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్న సమయంలో.. ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈసీ నియామకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ విషయంలో పారదర్శక సంస్కరణలు చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? అని ప్రశ్నించారు.