Rahul Gandhi Accused: చెప్పకుండా విదేశాలకు వెళ్లిపోతున్నారు!
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:50 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సందర్భంగా భద్రతా ప్రొటోకాల్‌ను పలుమార్లు ఉల్లంఘించారని...
భద్రతా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న రాహుల్
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు సీఆర్‌పీఎఫ్ లేఖ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సందర్భంగా భద్రతా ప్రొటోకాల్‌ను పలుమార్లు ఉల్లంఘించారని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఆరోపించింది. ఆయన చేసే విదేశీ ప్రయాణాలపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్‌కు వేర్వేరుగా లేఖలు రాసింది. రాహుల్ గతంలో ఇటలీ, వియత్నాం, ఖతార్, లండన్, మలేసియా తదితర దేశాల్లో పర్యటించిన వివరాలను అందులో ప్రస్తావించింది. భద్రతా కారణాల రీత్యా ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. కాగా, భద్రతా ప్రొటోకాల్‌ను రాహుల్ గాంధీ ఉల్లంఘించారంటూ సీఆర్‌పీఎఫ్ లేఖ రాయడంపై కాంగ్రెస్ గురువారం స్పందించింది. ఓట్ల చోరీ వ్యవహారంపై త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తామని రాహుల్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ లేఖ రాయడం ఆయన్ను బెదిరించడానికి తెర వెనుక నుంచి చేస్తున్న ప్రయత్నం కాదా అని పార్టీ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు.