Share News

Rahul Gandhi: బిహార్‌ ఓటమికి నేనూ బాధ్యుడినే

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:17 AM

బిహార్‌లో కాంగ్రెస్‌ ఓటమికి స్థానిక నాయకులతో సమానంగా తాను కూడా బాధ్యుడినేనని ఆ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నట్టు సమాచారం...

Rahul Gandhi: బిహార్‌ ఓటమికి నేనూ బాధ్యుడినే

న్యూఢిల్లీ, నవంబరు 28 : బిహార్‌లో కాంగ్రెస్‌ ఓటమికి స్థానిక నాయకులతో సమానంగా తాను కూడా బాధ్యుడినేనని ఆ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నట్టు సమాచారం. బిహార్‌ ఎన్నికల కోసం పనిచేసిన నాయకులు, పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతో కాంగ్రెస్‌ అధిష్ఠానం శుక్రవారం అంతర్గత సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగానే రాహుల్‌ పై వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈసీ చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియ వల్లే బిహార్‌లో ఓడిపోయామని నేతలు తేల్చినట్టు తెలిసింది. ఓటమినే తలుచుకుని బాధపడకుండా, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని రాహుల్‌ ఈ సమావేశంలో నేతలకు హితబోధ చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘వ్యవస్థాగత బలహీనతలే కాంగ్రె్‌సను దెబ్బతీశాయనే వాదనను రాహుల్‌ సమావేశంలో అంగీకరించలేదు. అదే నిజమైతే గట్టి పార్టీ నిర్మాణాలు కలిగిన ఆర్జేడీ, వామపక్షాలు ఎందుకు ప్రభావం చూపలేకపోయాయని ఆయన ప్రశ్నించారు. ఏఏ అంశాలు బిహార్‌లో పార్టీని దెబ్బతీశాయనేది నిర్దిష్టంగా గుర్తించాలని, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ఆయన దిశానిర్దేశం చేశారు’’ అని ఓ నేత తెలిపారు. కాగా, ప్రాణాంతకంగా మారిన ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరపాలని కేంద్రాన్ని రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 29 , 2025 | 03:17 AM