Rahul Gandhi: విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:14 AM
విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటివారు భారత్‌కు వచ్చినప్పుడు.. వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ....
ప్రతిపక్ష నేతతో సమావేశం కావొద్దని ప్రభుత్వం వారికి చెబుతోంది : రాహుల్ గాంధీ
రాహుల్ ఆరోపణలు పచ్చి అబద్ధం: బీజేపీ
న్యూఢిల్లీ, డిసెంబరు 4: విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటివారు భారత్‌కు వచ్చినప్పుడు.. వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇది ఎన్డీయే ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని విమర్శించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గురువారం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘విదేశాల అధినేతలు భారత్‌కు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కూడా కలవడం మన సాంప్రదాయం. వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో అది కొనసాగింది. ప్రధాని మోదీగానీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌గానీ ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పుడు విదేశాల నేతలు ఇక్కడికి వచ్చినా, నేను విదేశాలకు వెళ్లినా.. ప్రతిపక్ష నేతను కలవవద్దని వారికి ప్రభుత్వం సూచిస్తోంది. నన్ను కలవవద్దని ప్రభుత్వం చెప్పిందంటూ విదేశాల నేతల నుంచి నాకు సమాచారం వస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా, భారత్‌కు వచ్చే విదేశాల అధినేతలు ఇక్కడి ప్రతిపక్ష నేతను కలవడం ప్రొటోకాల్‌లో భాగమని, కానీ మోదీ ప్రభుత్వం దీనిని ఉల్లంఘిస్తోందని ప్రియాంకగాంధీ విమర్శించారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ‘‘రాహుల్ వ్యాఖ్య లు పచ్చి అబద్ధం. గత ఏడాదిన్నర కాలంలో మలేషియా, న్యూజిలాండ్, మారిషస్, వియత్నాం ప్రధానులు సహా పలువురు విదేశాల నేతలను రాహుల్ కలిశారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలుని అన్నారు.