Share News

Vice President: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 03:20 AM

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా నిలిచారు..

Vice President: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

  • జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపు

  • రాధాకృష్ణన్‌కు 452, సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు

  • 781 మంది ఎంపీల్లో 767 మంది ఓటు

  • 14 మంది గైర్హాజరు.. చెల్లని ఓట్లుగా 15 గుర్తింపు

  • డీఎంకే సహా 15 మందికి పైగా విపక్ష ఎంపీల క్రాస్‌ ఓటింగ్‌

  • సుదర్శన్‌రెడ్డికి ఇద్దరు లేదా ముగ్గురు వైసీపీ ఎంపీల మద్దతు?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా నిలిచారు. ఈ ఎన్నికలో విజయానికి 377 ఓట్లు అవసరం కాగా రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి 300 ఓట్లు సాధించారు. మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంట్‌ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేడీ, శిరోమణి అకాళీదళ్‌ పార్టీలకు చెందిన 12 మంది సభ్యులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 15 మంది సభ్యుల ఓట్లు చెల్లలేదు. ఎన్డీఏ కూటమి సభ్యులందరూ రాధాకృష్ణన్‌కు ఓటు వేయగా.. విపక్షాలకు చెందిన సభ్యుల్లో 15 మందికి పైగా క్రాస్‌ ఓటింగ్‌ చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికారని స్పష్టమైంది. తెలుగు ఆత్మ గౌరవం పేరుతో ఇండియా కూటమి పక్షాలు తెలుగు ఎంపీల ఓట్లను చీల్చేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలం కాగా, డీఎంకేకు చెందిన పలువురు సభ్యులు తమిళ ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిచ్చి రాధాకృష్ణన్‌కు ఓటు వేయడం గమనార్హం. ఇక.. ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు అని వైసీపీ ప్రకటించినప్పటికీ.. కనీసం ముగ్గురు వైసీపీ ఎంపీలు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి ఓటు వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

98 శాతం పోలింగ్‌..

పార్లమెంట్‌ కొత్త భవనంలోని ‘ఎఫ్‌-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఏడున్నర తర్వాత... 152 ఓట్ల ఆధిక్యంతో రాధాకృష్ణన్‌ గెలుపొందినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ప్రమోద్‌చంద్ర మోదీ ప్రకటించారు. ఎన్నికల్లో సుమారు 98ు పోలింగ్‌ జరిగింది.


క్రాస్‌ ఓటింగ్‌..

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందని ఎన్డీయే, ఇండియా.. రెండు పక్షాలూ మొదటి నుంచి చెబుతున్నాయి. తమకు 315 మంది సభ్యుల మద్దతు ఉందని ఇండియా కూటమి చెబుతుండగా.. ఎన్డీయే కూటమికి 427 ఓట్లు ఉన్నాయి. ఏపీకి చెందిన వైసీపీ సైతం ఎన్డీయేకి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి ఉభయసభల్లోనూ కలిపి 11 మంది ఎంపీలు ఉన్నారు. వారిని కూడా కలుపుకొంటే ఎన్డీయే కూటమికి 438 ఓట్లు రావాలి. కానీ, ఆ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు అనూహ్యంగా 452 ఓట్లు వచ్చాయి. అంటే.. ఇండియా కూటమి నుంచి సుమారు 14 మంది ఎన్డీఏకు క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్టు. రాధాకృష్ణన్‌ తమిళుడు కాబట్టి.. కొందరు డీఎంకే ఎంపీలు ఆయనకు ఓటేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపిన వైసీపీ ఎంపీల్లోనూ ఇద్దరు.. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి ఓటు వేసినట్టు తెలిసింది. వారితోపాటు సుదర్శన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరో వైసీపీ ఎంపీ సైతం ఆయనకే ఓటేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక.. పోలైన ఓట్లలో 15 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఆ 15 మంది ఏ కూటమికి చెందిన వారన్నదానిపై రెండు కూటములు విశ్లేషిస్తున్నాయి. ఇండియా కూటమికి చెందిన మొత్తం 315ఓట్లు పూర్తిగా పోలయ్యాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రకటించిన కొద్దిేసపటికే, ఆ కూటమి అభ్యర్థికి సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చినట్టు ఎన్నికల అధికారి ప్రకటించడం గమనార్హం. నిజానికి ఉభయసభల్లోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఉన్న 12 మంది ఎంపీలు కూడా ఇండియా కూటమికి వేస్తే 327 ఓట్లు రావాలి. కానీ.. 300 ఓట్లు మాత్రమే రావడం ఇండియా కూటమి పార్టీల అనైక్యతను సూచిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, చెల్లని ఓట్లలో ఎన్డీఏ సభ్యులవే 10 ఓట్లు ఉన్నట్టు, మిగతా ఐదు ఓట్లూ ఇండియా కూటమికి చెందిన వారివని తెలుస్తోంది.

ఓటింగ్‌కు దూరంగా...

ఎన్డీయే కూటమి.. ఇండియా కూటమి.. రెండింటికీ తాము సమానదూరం పాటిస్తామంటూ నవీన్‌పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతాదళ్‌ (బీజేడీ) ఈ ఎన్నికకు దూరంగా ఉంది. ఆ పార్టీకి లోక్‌సభలో ఒక్క ఎంపీ కూడా లేరు. రాజ్యసభలో ఏడుగురు సభ్యులున్నారు. ఇక.. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. ఆ పార్టీకి కూడా లోక్‌సభలో ఎంపీలు లేరు. రాజ్యసభలో నలుగురు ఎంపీలున్నారు. ఇక.. దేశానికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుండే పంజాబ్‌కే ఇప్పుడు వరదలతో తీవ్ర కష్టం వస్తే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆదుకోలేదంటూ శిరోమణి అకాలీదళ్‌ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎంపీ.. కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌. వీరు కాక మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.


1.jpg

సైద్ధాంతిక పోరు సాగుతుంది: జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు తనకు అనుకూలంగా లేనప్పటికీ.. తమ లక్ష్యం విలువ తగ్గిపోలేదని ఇండియా కూటమి అభ్యర్థిజస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి తన ప్రకటనలో తెలిపారు. ఇకపై మరింత తీవ్రంగా తమ సైద్ధాంతిక యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి విశ్వాసంతో తాను ఈ ఫలితాలను వినయంగా ఆమోదిస్తున్నానని చెప్పారు. తనకు లభించిన ఈ అవకాశమే ఎంతో గొప్పదని, ఎంతో గౌరవం కల్పించిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం విజయాల ద్వారానే పటిష్ఠం కాలేదని.. చర్చలు, నిరసన, భాగస్వామ్యం ద్వారా పరిపక్వం అవుతుందని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు.

Updated Date - Sep 10 , 2025 | 03:20 AM