BJP MP R. Krishnaiah: ఓబీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:05 AM
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ లభించడం లేదని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో ఆర్.కృష్ణయ్య డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ లభించడం లేదని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల మెరికల్లాంటి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కేంద్ర విద్యాసంస్థల్లోని ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఫీజులు భారీగా ఉండటం వల్ల పేద ఓబీసీ విద్యార్థులు సీటు వచ్చినా చేరలేకపోతున్నారని తెలిపారు. కేంద్ర విద్యాసంస్థలలో ఓబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో అన్యాయం జరుగుతోందని, అదే సమయంలో ఈడబ్ల్యూఎస్, ఇతర రిజర్వుడ్ కేటగిరిల విద్యార్థులకు మాత్రం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు వస్తున్నాయని, కేంద్రప్రభుత్వం కూడా ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలని కోరారు.