Chandigarh Bill: చండీగఢ్‌ను వదులుకోం
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:42 AM
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా రాజ్యాంగ అధికరణం...
భగ్గుమన్న పంజాబ్ రాజకీయ పార్టీలు
కేంద్ర ప్రభుత్వ బిల్లుతో దుమారం
చండీగఢ్‌పై మాకు హక్కుంది: సీఎం మాన్
ఆ బిల్లు పంజాబ్‌పై దాడే: కేజ్రీవాల్
లాక్కుంటే తీవ్ర పరిణామాలు: కాంగ్రెస్
అది పంజాబ్ వ్యతిరేక బిల్లు: బాదల్
ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ, చండీగఢ్, నవంబరు 23: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా రాజ్యాంగ అధికరణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. చట్ట సభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ తరహాలో చండీగఢ్‌ను కూడా రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని యోచించింది. దీనికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలనుకుంది. బిల్లు ఆమోదం పొందితే పంజాబ్ గవర్నర్ పర్యవేక్షణలో ఉన్న చండీగఢ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి స్వతంత్ర పాలకుడిగా నియమితులవుతారు. అయితే పంజాబ్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. చండీగఢ్‌పై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో రాజకీయ దుమారం రేగింది. పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తప్పుబట్టారు. చండీగఢ్‌పై పంజాబ్‌కు హక్కు ఉందని, వదులుకోబోమని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన పంజాబ్‌పై దాడి అని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శించారు. చండీగఢ్‌ను లాక్కుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా హెచ్చరించారు. పంజాబ్ బీజేపీ నేతలు కేంద్రం వైపు ఉంటారో లేక పంజాబ్ వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. పంజాబ్ వ్యతిరేక బిల్లుగా అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. పంజాబ్‌లోని రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించడంతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ బిల్లును పెట్టడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపాకే బిల్లును ప్రవేశపెడతామని తెలిపింది.