Public Sector Banks: ఐదున్నరేళ్లలో 6.15 లక్షల కోట్ల లోన్లు రైటాఫ్
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:01 AM
గత ఐదున్నరేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ)లు రూ.6.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయని లోక్‌సభలో కేంద్రం తెలిపింది..
న్యూఢిల్లీ, డిసెంబరు 8: గత ఐదున్నరేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ)లు రూ.6.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయని లోక్‌సభలో కేంద్రం తెలిపింది. ‘ఆర్బీఐ డేటా ప్రకారం.. గత ఐదు ఆర్థిక సంవత్సరాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.6,15,647 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎ్‌సబీలకు ఎటువంటి మూలధన సాయం చేయలేదని.. ఆయా బ్యాంకులు తమ ఆర్థిక పనితీరు, మూలధన స్థితిని గణనీయంగా మెరుగుపర్చుకుని లాభదాయకంగా మారాయన్నారు. పీఎ్‌సబీలు ఇప్పుడు తమ మూలధన అవసరాలను తీర్చుకోవడానికి మార్కెట్ వనరులు, అంతర్గత సముపార్జనలపై ఆధారపడుతున్నాయని.. అవి 2022 ఏప్రిల్ 1 నుంచి 2025 సెప్టెంబరు 31 వరకు ఈక్విటీ, బాండ్ల ద్వారా మార్కెట్ నుంచి రూ.1.79 లక్షల కోట్ల మూలధనాన్ని సేకరించాయని తెలిపారు.