Share News

Priyanka gandhi: మోదీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:14 AM

మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తిప్పికొట్టారు. ఆయన ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందన్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను...

Priyanka gandhi: మోదీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది

మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తిప్పికొట్టారు. ఆయన ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందన్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం వందేమాతరంపై చర్చను చేపట్టిందని ఆరోపించారు. ‘నెహ్రూను తరచూ విమర్శించే బదులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అన్ని నిందలపై ఒకేసారి చర్చించి ఆ అఽధ్యాయాన్ని ఇక ముగిద్దాం. అవి 999 లేదా 9999 నిందలు కావచ్చు. ఇందిర, రాజీవ్‌ ఏమి చేశారో? వారసత్వ రాజకీయాలు ఏమి చేశాయో? మీ ఫిర్యాదులన్నీ దేశానికి ఒకేసారి చెప్పండి. తర్వాత వాటిపై చర్చిద్దాం. ఆ తర్వాత ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై చర్చిద్దాం’ అన్నారు. మోదీ ప్రధాని పదవిలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, నెహ్రూ దేశ స్వాతంత్య్రం కోసం 12 ఏళ్లు జైల్లో ఉన్నారని చెప్పారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉప నాయకుడు గౌరవ్‌ గొగోయ్‌ మాట్లాడుతూ మోదీ ఏ అంశంపై మాట్లాడినా.. నెహ్రూ, కాంగ్రె్‌సలను ప్రస్తావించడం అలవాటైపోయిందన్నారు. బీజేపీ పూర్వీకులు వందేమాతరాన్ని ఆలపించలేదన్నారు. సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేశ్‌ మాట్లాడుతూ స్వాత్రంత్య పోరాటంలో పాల్గొననివారు వందేమాతరం విలువల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘విద్వేషాలు సృష్టించేందుకు విచ్చిన్న శక్తులు వందేమాతరాన్ని వాడుకుంటున్నాయి. బ్రిటిష్‌ పాలకుల విభజించు-పాలించు విధానాన్నే వీరు అవలంబిస్తున్నారు’ అన్నారు. వందేమాతరం హిందువుల గీతం అన్నట్టు ప్రచారం చేసినవారే ఆ గీతంపై వివాద సృష్టికి, విభజనకు కారకులని డీఎంకే ఎంపీ ఎ.రాజా అన్నారు. దీనిపై వివాదం సమాజం సృష్టించింది కాదని, ముస్లింలు దానికి కారణం కాదని, ఈ గీతానికి మతం రంగు పులిమినవారి వల్లే సమస్య తలెత్తిందన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 03:15 AM