Share News

Engineering Marvel in Mizoram: ఈశాన్యాన వెలుగు రేఖ!

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:55 AM

ఐజ్వాల్‌.. మిజోరం రాజధాని. ఎటు చూసినా పచ్చని అడవులతో నిండిన కొండలు. అగాధాలను తలపించే లోయలు. ఆ లోయల్లో జలజల పారే నీటి హొయలు...

Engineering Marvel in Mizoram: ఈశాన్యాన వెలుగు రేఖ!

  • మిజోరంలో ఇంజనీరింగ్‌ అద్భుతం.. కొండలు, లోయల గుండా రైల్వేలైన్‌ నిర్మాణం

  • రాజధాని ఐజ్వాల్‌కు ఇక రైళ్ల పరుగు.. బైరాబి-సాయ్‌రంగ్‌ లైన్‌కు నేడు ప్రధాని ప్రారంభం

ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్టు అంతెత్తు పిల్లర్‌.. అది కూడా మామూలుగా కాదు.. అత్యంత ఎత్తైన రాతి కట్టడం కుతుబ్‌మినార్‌ (72 మీటర్లు) కంటే మరో 42 మీటర్లు ఎత్తున్న 114 మీటర్ల అతి భారీ పిల్లర్‌.. దానిపై ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి అద్దం పట్టే ఇనుప బ్రిడ్జి.. కిందికి చూస్తే కళ్లు తిరిగే లోయ.. దాటి కాస్త ముందుకెళితే మరికొన్ని భారీ వరుస బ్రిడ్జిలు.. ఒక దాని వెంట ఒకటిగా వచ్చే పొడవాటి టన్నెళ్లు.. ఈశాన్య భారతాన సరికొత్త వెలుగురేఖలా పేర్కొనదగ్గ బైరాబి-సాయ్‌రంగ్‌ రైల్వే లైన్‌పై వెళుతున్నప్పుడు కనిపించే అద్భుతాలివి.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు రైల్‌ కనెక్టివిటీ కోసం నిర్మించిన ఈ లైన్‌ను ప్రధాని మోదీ శనివారం స్వయంగా ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా దాని విశిష్టతలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

(ఐజ్వాల్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)

ఐజ్వాల్‌.. మిజోరం రాజధాని. ఎటు చూసినా పచ్చని అడవులతో నిండిన కొండలు. అగాధాలను తలపించే లోయలు. ఆ లోయల్లో జలజల పారే నీటి హొయలు. ప్రతి కొండ అంచున ప్రజల ఆవాసం. చదునైన ప్రాంతం ఉన్నా లేకున్నా, ప్రకృతి సవాళ్లకు ఎదురీదే రీతిలో లోయలోకి ఎప్పుడు జారిపోతాయో అనేలా నిర్మించిన ఇళ్లు. 20-25 అడుగుల లోతు నుంచి వేసిన కాంక్రీట్‌ పిల్లర్లు లేదా పొడవాటి వెదురు దుంగలతో నిర్మించిన ఇళ్లే ఆవాసం. కొండ అంచుకు, ఆ ఇళ్లకు మధ్య నుంచి వేసిన రోడ్లే ప్రయాణ మార్గాలు. ఇన్ని ప్రకృతి సవాళ్ల మధ్య జీవనం సాగించే ఐజ్వాల్‌ వాసుల జీవితాల్లో సరికొత్త వెలుగు రేఖ బైరాబి-సాయ్‌రంగ్‌ రైల్వే లైను. ఇళ్లు, రోడ్లు నిర్మించడమే సవాల్‌గా ఉండే మిజోరం లో నిర్మించిన 51.38 కిలోమీటర్ల ఈ లైను ఒక ఇంజనీరింగ్‌ అద్భుతమనే చెప్పాలి.

11 ఏళ్ల సుదీర్ఘ యజ్ఞం

అన్ని రాష్ట్రాల రాజధానులనూ రైల్‌ నెట్‌వర్క్‌తో కలపాలన్న లక్ష్యంలో భాగంగా మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు రైల్వే లైన్‌ వేసే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 2014లో శంకుస్థాపన చేశారు. అప్పటిదాకా మిజోరంలోని బైరాబి వరకు మాత్రమే రైల్వే లైను ఉండేది. అసోం సరిహద్దుకు సమీపంలోని ఈ స్టేషన్‌ వరకు లైన్‌ ఉన్నప్పటికీ మిజోరం ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అందుకే రాజధాని ఐజ్వాల్‌ను కలిపే లక్ష్యంతో ఈ బైరాబి నుంచి ఐజ్వాల్‌ పక్కనుండే సాయ్‌రంగ్‌కు లైన్‌ వేసే యజ్ఞాన్ని తలపెట్టారు. కానీ ఈ మార్గం పొడవునా ఎత్తైన కొండలు, భారీ లోయలే ఉన్నాయి. వాటన్నింటి మధ్య నుంచి ఎత్తుపల్లాల్లేకుండా సమాంతరంగా రైల్వే లైన్‌ నిర్మించడమంటే ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనే. రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చయ్యింది.

14.jpg


ఎన్నెన్నో సవాళ్లు!

మైదాన ప్రాంతంలో ఓ కొత్త రైల్వే లైను నిర్మించడానికే ఏళ్లకు ఏళ్లు పట్టడం మనం చూస్తుంటాం. అలాంటిది పూర్తిగా కొండలు, లోయలతో నిండి ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు అంటే ఇక చెప్పేదేముంది. కొండలను తొలిచి టన్నెల్స్‌ నిర్మించి, వందల అడుగుల లోతున్న లోయల నుంచి పిల్లర్స్‌ వేసి భారీ గర్డర్స్‌తో బ్రిడ్జిలు కడితే గానీ ముందుకు సాగని ప్రాజెక్టు ఇది. పైగా మిజోరంలో ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. అంటే ఏడాదిలో నవంబరు నుంచి మార్చి వరకు 5 నెలలు మాత్రమే పనులు సాగేవి. ఇక వంతెనలు, టన్నెల్స్‌ నిర్మించాలంటే భారీ యంత్ర సామగ్రిని తరలించాలి. ఇది మరో సవాల్‌. వాటి తరలింపు కోసం ఏకంగా 200 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాల్సి వచ్చింది. ఈ భారీ ప్రాజెక్టుకు ఇసుక, కంకరతో సహా దాదాపు నిర్మాణ సామగ్రి మొత్తాన్ని అసోం, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి తరలించాల్సి రావడం మరో సవాల్‌.

ఇంజనీరింగ్‌ అద్భుతం!

బైరాబి-సాయ్‌రంగ్‌ లైన్‌ మొత్తం పొడవులో 54ు మేర బ్రిడ్జిలు, టన్నెల్సే ఉంటాయంటే ఇదెంత కష్టసాధ్యమైన ప్రాజెక్టు అనేది అర్థం చేసుకోవచ్చు. చిన్నవాటిని పక్కనపెట్టినా 55 ఎత్తైన బ్రిడ్జిలు కట్టారు. మరీ ముఖ్యంగా ఈ కొండ అంచు నుంచి ఆ కొండ అంచుకు మధ్యలో ఉన్న లోయ మీదుగా బ్రిడ్జిలు వేయడానికి దాదాపు ఆరుచోట్ల అతి ఎత్తైన పిల్ల్లర్లు వేయాల్సి వచ్చింది. 70 మీటర్ల నుంచి 114 మీటర్ల ఎత్తున్న పిల్లర్లు నిర్మించి, వాటిని కలుపుతూ ఇనుప గర్డర్లతో వేసిన ఆ బ్రిడ్జిలను చూస్తే ఇంజనీర్ల శ్రమ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అన్నిటికంటే ఎత్తైన 144వ నంబరు బ్రిడ్జి సాయ్‌రంగ్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఉంది. మొత్తం 5 పిల్లర్లు ఉండగా, ఒక దాని ఎత్తు 114 మీటర్లు (374 అడుగులు). దేశంలోని రైల్వే ప్రాజెక్టుల్లో నిర్మించిన అతి ఎత్తైన పిల్లర్లలో ఇది రెండవది. మణిపూర్‌లో ఉన్న అతి భారీ పిల్లర్‌ ఎత్తు 141 మీటర్లు. ఇక కొండలను తొలుస్తూ వేసిన టన్నెల్స్‌ పొడవు మొత్తం లైన్‌లో 31 శాతం.


మారనున్న ముఖచిత్రం!

బైరాబి-సాయ్‌రంగ్‌ రైల్వే లైన్‌ను ఐజ్వాల్‌కు గేమ్‌ చేంజర్‌గా భావిస్తున్నారు. రాజధానికి రైల్‌ కనెక్టివిటీ ఏర్పడటంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ముఖ్యంగా సరుకు రవాణా పెరగడంతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుంది. అలాగే మిజోరంలో విరివిగా లభించే అటవీ ఉత్పత్తులకు, ఉద్యాన ఉత్పత్తులకు, అక్కడ తయారయ్యే కళాకృతులకు బయటి మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ లైన్‌ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించగానే ఏకంగా ఢిల్లీకి కూడా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రావడం మిజోరం యువత ఉద్యోగావకాశాలను పెంచే అంశమే. ఇక పచ్చటి అందాలతో అలరారుతూ, ఏడాదిలో అత్యధిక కాలం జల్లులు పడుతుండే మిజోరంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కేందుకూ మార్గం సుగమమవుతుంది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రాంతాల పర్యాటకులు ఇకపై ఐజ్వాల్‌నూ తమ పర్యాటక గమ్యంగా ఎంచుకునే అవకాశముంది.

ఎన్నెన్నో విశేషాలు!

రైల్వే లైన్‌ పొడవు 51.38 కిలోమీటర్లు ప్రాజెక్టు వ్యయం రూ.8,071 కోట్లు ఎంత స్పీడ్‌కు అనుకూలం: గంటకు వంద కిలోమీటర్లు

మొత్తం బ్రిడ్జిలు: 143

వాటి పొడవు: 11.78 కిలోమీటర్లు

వాటిలో అతి పెద్దవి: 6

అత్యంత ఎత్తైన పిల్లర్‌: 114 మీటర్లు (374 అడుగులు)

ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు: 10

మొత్తం టన్నెళ్లు: 45

వాటి పొడవు: 15.88 కిలోమీటర్లు

వాటిలో అతి పొడవైనది: 1.8 కిలోమీటర్లు

Updated Date - Sep 13 , 2025 | 06:31 AM