PM National Children Awards: 20 మంది వీర బాలలకు పురస్కారాల ప్రదానం
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:41 AM
వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన పిల్లలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారా’లను బహూకరించారు..
బహూకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అవార్డులు అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విశ్వనాథ్, శివాని
న్యూఢిల్లీ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన పిల్లలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారా’లను బహూకరించారు. ధైర్యసాహసాలు, సామాజిక సేవలు, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అసాధారణ విజయాలను సాధించినందుకు వీటిని అందజేశారు. వీర్ బాల్ దివ్‌సను పురస్కరించుకొని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలకు వీటిని ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతరోహకుడు విశ్వనాథ్ కార్తికేయ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్ క్రీడాకారిణి శివాని హోసూరు ఉప్పర ఉన్నారు. రికార్డులు సృష్టిస్తున్న క్రికెట్ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ కూడా పురస్కారం అందుకున్నాడు.
విశ్వనాథ్ పేరిట 4 ప్రపంచ రికార్డులు
తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ్ పర్వతరోహకుడు. ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం ద్వారా ’సెవెన్ సమ్మిట్స్’ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. విశ్వనాథ్ పేరిట నాలుగు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అందులో ఎల్‌బ్రూస్ పర్వతాన్ని కేవలం 24 గంటల్లోనే ధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు కూడా ఒకటి. విశ్వనాథ్ ఆరు ఖండాల్లోని 20కి పైగా పర్వతాలను అధిరోహించాడు.
పారా అథ్లెటిక్స్‌లో శివాని సత్తా..
దివ్యాంగురాలైన ఏపీకి చెందిన 17 ఏళ్ల శివాని థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్(2023) అండర్ 20 విభాగంలో జావెలిన్ ఎఫ్45, షాట్‌పుట్ క్రీడల్లో విజేతగా నిలిచింది. గతేడాది బెంగళూరులో నిర్వహించిన నేషనల్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్స అండర్ 17 విభాగంలో 100 మీటర్ల పరుగు, జావెలిన్ త్రో, షాట్ పుట్‌లో మూడు బంగారు పతకాలను గెలిచింది. 12వ నేషనల్ ఛాంపియన్‌షి్‌ప్స(2023) మహిళల జావెలిన్ త్రోలో రజత పతకం సాధించింది.
ఆపరేషన్ సిందూర్‌లో ‘చిట్టి పౌర యోధుడు’
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశానికి తన వంతు సేవలు అందించి సైనికుల ప్రశంసలు అందుకున్న ఓ పదేళ్ల బాలుడు ఇప్పుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా చక్ తరన్ వాలీ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు నీరు, పాలు, టీ, లస్సీ అందజేశాడు. బాలుడి దేశభక్తిని చూసి సైనికులు మురిసిపోయారు. ‘యంగెస్ట్ సివిల్ వారియర్’ పేరుతో సన్మానించారు.
జెన్-జీతో వికసిత్ భారత్ సాకారం : ప్రధాని మోదీ
జెన్-జీపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, వారి సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం వికసిత్ భారత్ కలను సాకారం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో మోదీ పాల్గొని మాట్లాడారు. యువత కలలు, ఆకాంక్షలే దేశ దశ, దిశను నిర్ణయిస్తాయని అభిప్రాయపడ్డారు. యువత స్వల్పకాలిక ఆకర్షణల మోజులో పడకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లాలని సూచించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక యువతకు ఎన్నో రంగాల్లో అవకాశాలను కల్పించామని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరు పెద్ద.. ఎవరు చిన్న అనేది వయసు నిర్ణయించదని, చేసే పనులు సాధించే విజయాలే నిర్ణయిస్తామన్నారు.