President Droupadi Murmu: ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లో రాష్ట్రపతి ప్రయాణం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:00 AM
త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇటీవలే యుద్ధ విమానంలో..
బెంగళూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇటీవలే యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ఆదివారం ఉత్తర కర్ణాటక జిల్లా కారవార నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లో సాహస యాత్ర చేశారు. ఈ క్రమంలో జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. 2006 ఫిబ్రవరిలో.. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా కల్వరి శ్రేణి జలాంతర్గామిలో ప్రయాణించారు. నౌకాదళ యూనిఫాం ధరించిన రాష్ట్రపతి ముర్ము.. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌తో సముద్రంలోపల గంటకుపైగా ప్రయాణించారు. నేవీ బృందాల కార్యాచరణ, జలాంతర్గామి సాంకేతిక సామర్థ్యం గురించి ఆరా తీశారు. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌ను ఈ ఏడాది జనవరిలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. తక్కువ శబ్దం చేస్తూ సముద్ర గర్భంలో కదిలే ఈ జలాంతర్గామి శత్రు రాడార్లకు చిక్కకుండా నిఘా పెడుతుంది. అందుకే దీన్ని సైలెంట్ హంటర్ అని కూడా పిలుస్తారు.