Praveen Togadia: ముగ్గురేసి పిల్లలను కనండి
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:18 AM
శక్తిమంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని, కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు.
మూడో బిడ్డ బాధ్యత వీహెచ్‌పీదే: ప్రవీణ్ తొగాడియా
బెంగళూరు, జూన్ 16(ఆంధ్రజ్యోతి): శక్తిమంతమైన హిందూ దేశ నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని, కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. మూడోబిడ్డ బాధ్యత చదువు, ఫీజులు తదితర బాధ్యతను విశ్వహిందూ పరిషత్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. హుబ్బళ్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హిందువులకోసం దేశవ్యాప్తంగా హెల్ప్‌లైన్ ప్రారంభించామని, అడ్వకేట్ హెల్ప్‌లైన్, 10వేల మంది డాక్టర్లతో హిందువుల రక్షణకు సలహాలు, సేవలు అందించే విభాగం పనిచేస్తున్నాయని తెలిపారు. ముష్టి(పిడికిలి) బియ్యం పథకాన్ని ప్రారంభించామని, దేశంలో ఏ హిందువూ ఆకలితో బాధపడకూడనేదే దీని లక్ష్యమని చెప్పారు. ప్రతి హిందువు రోజూ గుప్పెడు బియ్యం పక్కనతీసి వంట చేసుకోవాలని, ఆ బియ్యాన్ని నెలకోసారి హిందువులకు పంచాలని కోరారు. తద్వారా ఏ హిందువూ ఆకలితో అలమటించరని అన్నారు.