Bihar Elections: అందరికీ శకునాలు చెప్పిన పీకే..
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:25 AM
అందరికీ శకునాలు చెప్పే బల్లి తాను కుడితిలో పడ్డట్టు..’గా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత్ కిషోర్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి అత్యంత విజయవంతమైన రాజకీయ....
బిహార్‌లో ప్రభావం చూపని ప్రశాంత్ కిషోర్ పార్టీ
200 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కసీటూ దక్కలే..
న్యూఢిల్లీ, నవంబరు 14: ‘అందరికీ శకునాలు చెప్పే బల్లి తాను కుడితిలో పడ్డట్టు..’గా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత్ కిషోర్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్త (పొలిటికల్ స్ట్రాటజి్‌స్ట)గా జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన పీకే, రాజకీయ నేతగా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. రాజకీయ వ్యూహకర్తగా బీజేపీ, జేడీ(యూ), కాంగ్రెస్, ఆప్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలను విజయపథంలో నడిపించి.. అధికార పీఠంపై కూర్చోబెట్టిన పీకే, ఓ పార్టీ అధినేతగా బిహార్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కసీటూ గెలవలేకపోయారు. జన్‌సురాజ్ (జేఎస్పీ) పేరుతో ఏడాదిన్నర క్రితం పార్టీని స్థాపించి.. పాదయాత్రతో బిహార్‌ను చుట్టేశారాయన. రాష్ట్రంలో వేళ్లూనుకున్న కుల ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయం జేఎస్పీ అని గొంతెత్తారు. ఏకబిగిన 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పీకేను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు జనం తండోపతండాలుగా వచ్చినా ఓట్లు మాత్రం పడలేదు. ఎందుకు? అనంటే.. విశ్లేషకులు అనేక కారణాలు చెబుతున్నారు. మార్పు తెస్తా, మిగతా పార్టీలకు జేఎస్పీనే ప్రత్యామ్నాయమంటూ తన ప్రసంగాల్లో ఊదరగొట్టిన పీకే.. మిగతా పార్టీల మాదిరిగా మేనిఫెస్టోతో రాకపోవడం, ఎన్నికల తర్వాత ఆయన వ్యూహం ఏమిటి? ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు? అనేవి చెప్పకపోవడం ఓటర్లను గందరగోళపరిచింది. పైగా పీకే 200 పైచిలుకు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. అలాకాకుండా... తమ పార్టీ ప్రభావం చూపే కొన్ని స్థానాలను గుర్తించి, అక్కడే అభ్యర్థులను నిలబెట్టి ఉంటే ఎంతో కొంత ప్రభావం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైపెచ్చు.. జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలతో మిగతా పార్టీల మాదిరిగా జేఎస్పీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం అతిపెద్ద మైనస్ అయింది. ఇక గతంలో తాను వ్యూహకర్తగా బీజేపీ, జేడీయూల తరఫున పనిచేసి, తాజాగా ఆయా పార్టీల నేతలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయడం వెనుక ఔచిత్యం ఓటర్లకు బోధపడలేదు. అన్నింటికీ మించి.. ఎన్నికల్లో పీకే పోటీ చేయలేదు. దీన్నే చాలామంది ఓటర్లు అర్థం చేసుకోలేకపోయారు. దీంతో ఎన్నికల్లో జేఎస్పీ 3.44శాతం ఓట్లకే పరిమితమైంది.