Prashant Kishor: 2 గంటల సలహాకు రూ.11 కోట్లు తీసుకున్నా
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:04 AM
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సోమవారం తన ఆదాయ వివరాలను ఓ బహిరంగ సభలో వెల్లడించారు....
మూడేళ్లలో రూ.241 కోట్లు గడించా
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడి
పట్నా, సెప్టెంబరు 29: రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సోమవారం తన ఆదాయ వివరాలను ఓ బహిరంగ సభలో వెల్లడించారు. ఇతరుల మాదిరిగా తాను దొంగను కానని, ఆదాయ వ్యయాలను స్పష్టంగా అందరికీ చెప్పగలనని అన్నారు. సలహాలు ఇచ్చి కోట్లు గడించానని చెప్పారు. రెండు గంటలపాటు సలహాలు ఇచ్చినందుకు రూ.11 కోట్లు ఫీజుగా తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు రాజకీయ పార్టీలకు, సంస్థలకు, కంపెనీలకు సలహాలు ఇచ్చినా ఎలాంటి ఫీజులు తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం సలహాలు ఇవ్వడం ద్వారా సంపాదన మొదలుపెట్టానని, ఇది సమాజం కోసమేనన్నారు. ‘‘వ్యక్తులకు, కంపెనీలకు సలహాలు ఇవ్వడం ద్వారా గత మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా. ఇందులో 18 శాతం అంటే రూ.30.98 కోట్లు జీఎస్టీ చెల్లించా. రూ.20 కోట్లు ఆదాయపు పన్నుగా కట్టాను. రూ.98.95 కోట్లు జన్ సురాజ్ పార్టీకి విరాళంగా ఇచ్చా. ఒక కంపెనీకి రెండు గంటల పాటు సలహా ఇచ్చినందుకు రూ.11 కోట్లు తీసుకున్నా. ఇదీ బిహార్ కుర్రాడి శక్తి. మేం దొంగలం కాము’’ అని వివరించారు. చెల్లింపులు చెక్కుల రూపంలో జరిగాయని తెలిపారు. రాజకీయాల కోసం ప్రశాంత్ కిశోర్ ఎక్కడ నుంచి డబ్బులు తీసుకొస్తున్నారో వెల్లడించాలని బీజేపీ నాయకుడు సంజయ్ జైశ్వాల్ తదితరులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. బీజేపీ నాయకుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపైనా ప్రశాంత్ ఆరోపణలు చేశారు. హత్య కేసులో 1995లోనే సామ్రాట్‌కు శిక్ష పడిందని, కానీ మైనర్‌నంటూ నకిలీ సర్టిఫికెట్ చూపించి బయటపడ్డారని ఆరోపించారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.