Air pollution: నిస్తేజంగా పీసీబీలు!
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:59 AM
వాయు కాలుష్యంతో ప్రధాన నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాలుష్య నియంత్రణ బోర్డులు (పీసీబీ) తగినంత మంది సిబ్బంది లేక నిస్తేజంగా మారాయి....
దేశవ్యాప్తంగా 50ు పోస్టులు ఖాళీ
న్యూఢిల్లీ, డిసెంబరు 16: వాయు కాలుష్యంతో ప్రధాన నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాలుష్య నియంత్రణ బోర్డులు (పీసీబీ) తగినంత మంది సిబ్బంది లేక నిస్తేజంగా మారాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న పీసీబీలు, కమిటీల్లో దాదాపు 50శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీబీసీబీ)తో పాటు 28 రాష్ట్రాల్లోనూ కాలుష్య నియంత్రణ బోర్డులు (ఎస్‌పీసీబీ), కేంద్ర పాలిత ప్రాంతాలు, ఢిల్లీ ఎన్‌సీటీ పరిధితో కలిపి 8 కాలుష్య నియంత్రణ కమిటీలు (పీసీసీ) పని చేస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ చెప్పిన సమాధానం ప్రకారం... శాస్త్ర, సాంకేతిక విభాగాల్లో వీటికి మంజూరైన పోస్టుల సంఖ్య 6,932 కాగా అందులో 3,161 (45.6ు) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 100 శాతం ఖాళీలతో సిక్కిం అగ్రస్థానంలో నిలిచింది. 70 శాతానికి పైగా ఖాళీలతో జార్ఖండ్, ఏపీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఏటా శీతాకాలంలో వాయు కాలుష్య స్థాయులు అమాంతం పెరిగిపోయే ఢిల్లీ పీసీసీలో 44.5 శాతం, లద్ధాఖ్, దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూలలో 69 శాతం, చండీగఢ్‌లో 11.1 శాతం చొప్పున ఖాళీలున్నాయి.