Share News

Deputy CM DK Shivakumar: కర్ణాటకలో హైడ్రామా!

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:31 AM

కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, మరో రెండేళ్లు తానే బడ్జెట్‌ ప్రవేశపెడతానని సీఎం సిద్దరామయ్య చెప్పారు...

Deputy CM DK Shivakumar: కర్ణాటకలో హైడ్రామా!

  • ఢిల్లీ వెళ్లిన డీకే ఆప్త ఎమ్మెల్యేలు

  • ఆ విషయం తనకు తెలియదన్న డీకే

  • ‘మార్పుపై’ నిర్ణయం అధిష్ఠానానిదే: సిద్దరామయ్య

బెంగళూరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, మరో రెండేళ్లు తానే బడ్జెట్‌ ప్రవేశపెడతానని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఈ ప్రకటన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆప్తులలో ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఈ పరిణామాల క్రమంలో ఆయనకు సన్నిహితులైన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. మంత్రి చలువరాయస్వామితోపాటు మరింతమంది శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలోనే చక్కెర శాఖ మంత్రి శివానందపాటిల్‌ ఢిల్లీ వెళ్లడం సరికొత్త చర్చలకు దారితీసింది. ఢిల్లీ వెళ్లిన మంత్రులతోపాటు ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. మైసూరులో సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. నాయకత్వ మార్పు లేదా కేబినెట్‌ విస్తరణపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు. ఖర్గే శనివారం బెంగళూరుకు వస్తున్నారని, తాను స్వయంగా వెళ్లి కలుస్తానని అన్నారు. సిద్దరామయ్యకు ఆప్తులుగా పేరొందిన ముఖ్యులు డిన్నర్‌ మీటింగ్‌ నిర్వహించడం సరికొత్త చర్చకు దారితీసింది. మంత్రి సతీశ్‌ జార్కిహొళి తన నివాసంలో గురువారం రాత్రి విందు ఇచ్చారు.

ఎమ్మెల్యేలంతా నావాళ్లే: డీకే

గ్రూపు రాజకీయాలు తన రక్తంలోనే లేవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలంతా తనవాళ్లేనని చెప్పారు. తనకు ప్రత్యేకమైన గ్రూపులు, ఆప్తులు లేరన్నారు. సీఎం సిద్దరామయ్య ఐదేళ్లు అధికారంలో ఉంటానన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ. ‘చాలా సంతోషం, కాదన్నది ఎవరు?. ఆయనకు మా మద్దతు ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. తాను ఎవరినీ ఢిల్లీకి పంపలేదని, తనకు ఆ విషయం తెలీదని అన్నారు. అయితే, ‘‘ఎక్కడైతే కృషి ఉంటుందో.. అక్కడే ఫలాలు ఉంటాయి. ఎక్కడైతే భక్తి ఉంటుందో.. అక్కడే భగవంతుడు ఉంటాడు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 04:31 AM